Venkatesh : టాలీవుడ్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్థం బుధవారం నిర్వహించారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంతో విక్టరీ ఫ్యామిలీ వియ్యమందుకుంది. ఈ వేడుకను వెంకటేష్ ఇంట్లో నిర్వహించగా అతికొద్ది మంది సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. వీరిలో చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీలు హాజరయ్యారు. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో కొన్నేళ్ల క్రితమే మొదటి అమ్మాయి ఆశ్రిత వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె హవ్య వాహిని వివాహం జరగనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. అయితే తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచుతారు. కానీ తన రెండో కుమార్తెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.