మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు విభాగాన్ని వినియోగించుకోవాలి
జనతా ప్రతినిధితో మున్సిపల్ అదనపు కమిషనర్ సువార్త
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల ప్రజలు పారిశుధ్యం, జనన–మరణ ధ్రువపత్రాలు, వాణిజ్య లైసెన్సులు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సువార్త తెలిపారు.
‘జనతా ప్రతినిధి’తో ఆమె మాట్లాడుతూ, పై సమస్యలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ప్రజలు మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయంలోని సంబంధిత విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు ఫిర్యాదు విభాగంలో తమ దరఖాస్తును సమర్పించాలని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ సేవలను అందించడమే కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందని, అదే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచవచ్చని తెలిపారు.
మున్సిపల్ సేవలు పొందే సమయంలో ప్రజలు తమ దరఖాస్తులు, అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించాలని, ఏదైనా సమస్య ఎదురైతే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని అదనపు కమిషనర్ సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని ఆమె స్పష్టం చేశారు.


