భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్, అక్టోబర్ 6, జనతా న్యూస్: రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
దరఖాస్తుతో పాటు పత్రాలు
వ్యాపారులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు కింది పత్రాల 5 సెట్ల జిరాక్స్ ప్రతులను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అక్టోబర్ 17లోపు సమర్పించాలి.
- నిర్ణీత దరఖాస్తు ఫారం
- ఆధార్ కార్డు జిరాక్స్
- పదో తరగతి మార్కుల మెమో
- రూ.600 ప్రభుత్వ చలాన్
- ఫైర్, రెవెన్యూ/మున్సిపల్ శాఖల నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీలు)
అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని కమిషనర్ స్పష్టం చేశారు.
భద్రతా నిబంధనలు తప్పనిసరి
ఎక్స్‌ప్లోజివ్స్ రూల్స్, 2008 ప్రకారం అధికారులు ఆమోదించిన బహిరంగ మైదానాల్లో మాత్రమే తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలి. ఒక క్లస్టర్‌లో గరిష్టంగా 50 దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దుకాణాలను ఎదురెదురుగా ఏర్పాటు చేయకూడదు. రెండు దుకాణాల మధ్య కనీసం మూడు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ ప్రదేశంలో ఎలాంటి సామగ్రిని నిల్వ చేయరాదు. రక్షిత కట్టడాలకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేయాలి.
తాత్కాలిక షెడ్లను మండే స్వభావం లేని సామగ్రితోనే నిర్మించాలి. అనధికార వ్యక్తులు దుకాణాల్లోకి ప్రవేశించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
ప్రతి దుకాణం వద్ద తగిన సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు, ఇసుక, నీటి బకెట్లు అందుబాటులో ఉంచాలి. దుకాణాల లోపల, అలాగే 50 మీటర్ల పరిధిలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, అగర్‌బత్తీలు, లైటర్లు ఉపయోగించడం, పొగతాగడం, టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధం.
విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి
విద్యుత్ వైరింగ్‌ను గోడలు లేదా పైకప్పుకు మాత్రమే బిగించాలి. వేలాడే వైర్లను ఏర్పాటు చేయరాదు. ప్రతి వరుస దుకాణాలకు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు అనువైన మాస్టర్ స్విచ్ ఏర్పాటు చేయాలి.
అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సులభంగా రాకపోకలు సాగించేలా విశాలమైన మార్గాలను ఏర్పాటు చేయాలి. వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నివాస ప్రాంతాల్లో, సాధారణ వాణిజ్య దుకాణాల మధ్య లేదా అనుమతి లేని ప్రదేశాల్లో బాణసంచా విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించినా, అనుమతించిన పరిమితికి మించి బాణసంచాను నిల్వ చేసినా లేదా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.


