Harish Rao: కరీంనగర్, జనతా న్యూస్: రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనపడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన కరీంనగర్ లో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని దింపేస్తారన్న భయం వెంటాడుతోందన్నారు. ఆరు గ్యారెంటీ ల గురించి ,పాలన గురించి రేవంత్ మాట్లాడటం లేదని, అయితే తిట్టు… లేదంటే ఒట్టు … ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని అని విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ తో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని అన్నారు. బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారని, రేవంత్ కి అయితే అతి తెలివి ,లేదంటే మతిమరుపు అని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లిం ల ఆస్తులకి ఇబ్బందులు ఉండవని, రేవంత్ వచ్చాక ధరల పై అదుపు లేకుండా పోయిందని అన్నారు. పప్పు ,నూనె ధరలు ,సిమెంట్ ధరలు ఇలా అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోయాయని అన్నారు. అటు కేంద్రం లో బీజేపీ అలానే ఉందని, ఇటు రాష్ట్రం లో కాంగ్రెస్ లోనూ అలానే ఉందని చెప్పారు. బీసీ లపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీ లకి అత్యధిక టికెట్ లు ఇచ్చింది బిఆర్ఎస్ నే అని అన్నారు.