కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో..
రోజుకు వెయ్యికి పైగా డయాల్సీస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెఫ్రాలజీ డాక్టర్ల కొరత
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
శరీరంలో మూత్ర పిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడును విసర్జించి సమతూల్యతను కాపాడుతాయి. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న అహారం, ఇతర కారణాలతో ఎక్కువగా కిడ్నీ వ్యాధుల భారిన పడుతున్నారు. రోజు రోజుకు వీరి సంఖ్య పెరుగుతోంది. ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే రోజుకు సుమారు వెయ్యి మందికి పైగా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో డయాల్సీస్ చేసుకుంటారంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం కరీంనగర్‌లో ఒకే ప్రభుత్వ డయాల్సీస్ సెంటర్ ఉండగా, ఇప్పుడు 9కి చేరాయి. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 16 ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులు డయాల్సీస్ వైద్య సేవలు పొందుతుండగా, వేలాది మంది కిడ్నీ ఇతర సంబంధిత చికిత్సలు తీసుకోవడం ఆందోళన కల్గిస్తోంది.
మనిషి శరీరంలోని మెదడు, గుండె, లివర్‌తో పాటు అతిముఖ్యమైనవి మూత్ర పిండాలు. మలినాలను బయటకు పంపించి శుద్ధి చేయడంలో కీలక పాత్ర పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీ సంబంధిత రోగులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారీగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ప్రయివేటు ఆసుపత్రు లకు వివిధ కిడ్నీ సంబంధిత చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రధానంగా కరీంనగర్ లోని ప్రయివేటు మెడికల్ కాలేజీలతో పాటు వెంకటేశ్వర కిడ్నీ సెంటర్, అక్షయ మల్టి స్ఫెషల్ ఆసుపత్రులకు వందల సంఖ్యలో కిడ్నీ బాధిత రోగులు వచ్చి చికిత్స తీసుకోవడం..పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.కిడ్నీల్లో రాళ్లు, క్రీయేటీన్ పెరిగి వివిధ ఇబ్బందులతో ఆసుపత్రులకు వచ్చే రోగులు కూడా పెరుగుతున్నారు. వీరు క్రమ క్రమంగా డయాల్సీస్ వైపు మళ్లి ఆయుష్షును తగ్గించుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలోని డయాల్సీస్ సెంటర్లు..
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు.. డయాల్సీస్ సేవలు అందిస్తున్నాయి. ఇందులో 9 ప్రభుత్వ సెంటర్లు కాగా, 7 ప్రయివేటు ఆసుపత్రులున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, అక్షయ మల్టీ స్ఫెషల్, అపోలో రీచ్, ఆదర్శ, మెడికవర్ ఆసుపత్రులతో పాటు ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీల్లో డయాల్సీస్ సేవలు అందుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, ధర్మపురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కోరుట్ల ఏరియా ఆసుపత్రి, జగిత్యాల లోని అమృత త్రినేత్ర మల్టీ స్ఫెషల్ ఆసుపత్రి..రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి..పెద్దపల్లి జిల్లా ఆసుపత్రితో పాటు రామగుండం జరనల్ ఆసుపత్రుల్లో నిత్యం రోగులకు డయాల్సీస్ వైద్య సేవలు అందిస్తున్నారు.
రోజుకు 111 బెడ్లలో 828 మందికి డయాల్సీస్..
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజుకు 111 మిషన్ల ద్వారా 828 మంది రోగులకు డయాల్సీస్ సేవలు అందిస్తున్నారు. అదనంగా ఆర్థికంగా ఉన్న వారు ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో డయాల్సీస్ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ సెంటర్లలో సింగిల్ యూజ్ కిట్ల్ ద్వారా నాణ్యమైన డయాల్సీస్ సేవలు అందుతున్నాయి. ఆయా మిషన్ల ద్వారా రోజుకు రెండు నుండి మూడు షిప్టుల ద్వారా రోగుకుల డయాల్సీస్ చేస్తున్నారు సిబ్బంది. అయితే..ప్రభుత్వ సెంటర్లలో ఎక్కడా నెఫ్రాలజీ ప్రత్యేక నిపుణులు లేక పోవడంతో పలు సందర్భాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెఫ్రాలజీ వైద్య నిపుణులను నియమించడం వల్ల కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే నివారించే అవకాశాలుంటాయని పలువురు సూచిస్తున్నారు.
వ్యాధి వచ్చాక బాధ పడడం కన్నా..రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాలను అన్వేశించి, ముందస్తు చర్యలతో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.