కరీంనగర్, జనతా న్యూస్: నిత్యం మీకు అందుబాటులో ఉండే మంత్రి ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ మాదిరిగా నేను కూడా నా కొన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తానని, అందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రాావు అన్నారు. శనివారం ఆయన కోడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా జన్మభూమిలో కాలు పెడితే మనసు పులకించిపోతుందని అన్నారు. మా నాన్న చనిపోయే ముందు నా దగ్గర కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని ఒట్టు వేయించుకున్నారని చెప్పారు. జగపతిరావు తనయుడుగా నేను మీ అందరికీ సుపరిచితుడుని, నన్ను గెలిపిస్తే కరీంనగర్ కు ఎంపీ లాడ్స్ నిధులతో పాటు విద్యార్థుల కోసం ఐఐటి, నవోదయ, సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, యువత ఉపాధి కోసం టెక్స్ టైల్స్, సామాన్యుల కోసం రైల్వే లైన్ అభివృద్ధి తదితర కార్యక్రమంలో మీ ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం 4 నెలలలోపే ఎన్నికల హామీలను అమలు చేసి అన్ని రాష్ట్రాల చూపు మన వైపు తిప్పుకునేలా చేసిందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే నిలిచిపోయిన మరో పథకంతో పాటు రెండు లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు 2500 డబ్బులు, వర్షాకాలంలో 500 బోనస్, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు తదితర కార్యక్రమాలను కచ్చితంగా చేసి తీరుతుందని చెప్పారు. దేవుడిని అడ్డం పెట్టుకోని ఓట్లు దండుకోవాలని చూసే బిజెపి.. కరీంనగర్ కంటే వరంగల్ జిల్లా మీద ఎక్కువ మక్కువ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.