తిమ్మాపూర్, జనతా న్యూస్: నకొండూర్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంచినీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్య నివారణకు రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనిమిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా త్రాగు నీటి విషయంలో సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగేందుకు, నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ (ఇంట్రా ) కార్యనిర్వాహక ఇంజినీర్ అంజన్ రావు, ఉప ఇంజినీర్ సూర్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
- Advertisment -
