ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి
తీగలగుట్టపల్లి మీదుగా వెళ్లే అన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలి
జనతా ప్రతినిధితో మేయర్ కొలగాని శ్రీనివాస్

జనతా న్యూస్, కరీంనగర్:
తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఆర్ఓబీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా మేయర్ జనతా ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్ఓబీ పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ సాధారణ నిధులతో తాత్కాలికంగా తారు రోడ్డు ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. శాశ్వత రహదారి నిర్మాణానికి సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని, అందుకు అవసరమైన లోతు వరకు రోడ్డు తవ్వి కంకర తదితర పొరలతో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.
అయితే ప్రస్తుతం నిర్మించిన రోడ్డు శాశ్వత రోడ్డు కాదని, ఆర్ఓబీ పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి మాత్రమేనని స్పష్టం చేశారు. సాధారణంగా శాశ్వత రోడ్డుకు నాలుగు పొరల నిర్మాణ విధానం అవసరమవుతుందని, ప్రస్తుతం తాత్కాలిక అవసరాల దృష్ట్యా రెండు పొరలతో రోడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వర్షాకాలం.. అనివార్య పరిస్థితుల్లో తాత్కాలిక రోడ్డు
రోడ్డు నిర్మాణానికి అనువైన కాలం ఎండాకాలమే అయినప్పటికీ, ఆర్ఓబీ, ఆర్అండ్బీ సంబంధిత ప్రతిపాదనలు, అనుమతుల్లో జాప్యం కారణంగా అప్పట్లో పనులు చేపట్టలేకపోయామని మేయర్ తెలిపారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కొనసాగకుండా ఉండేందుకు ప్రస్తుత పరిస్థితుల్లోనే తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు.
ఈ ప్రాంతం నల్లరేగడి నేల కావడం, గతంలో ఆర్ఓబీ పిల్లర్ల కోసం తవ్వకాలు జరగడం, వర్షాకాల పరిస్థితులు కూడా రోడ్డు స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడిన గుంతలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మరమ్మతులు చేపడతామని చెప్పారు.
ఆర్ఓబీ పూర్తయితేనే శాశ్వత పరిష్కారం
ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాయని, పనులు త్వరగా పూర్తయ్యేలా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నామని మేయర్ తెలిపారు. ప్రభుత్వ స్థాయిలోనూ అవసరమైన చర్యల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి పనులను రాజకీయ కోణంలో చూడకుండా, ప్రజా ప్రయోజనాల దృష్టితో అందరూ సహకరించాలని మేయర్ కోరారు. ఆర్ఓబీ పనులు వేగంగా పూర్తయితేనే తీగలగుట్టపల్లి ప్రజలకు రవాణా సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.


