Wednesday, October 7, 2026

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి

జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

కాలానుగుణంగా జర్నలిస్టులు ఏఐపై పట్టు సాధించాలి: డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్

జనతా న్యూస్, ఖమ్మం:
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ (రజ్జు భయ్యా) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, లేనిపక్షంలో జర్నలిస్టుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

బుధవారం ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణా ప్రతాప్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ లేబర్ చట్టాలకు అనుగుణంగా ఆటో కార్మికులకు న్యాయం చేసేందుకు ఆటో యూనియన్లతో సమీక్షలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. ఆటో కార్మికుల కంటే కూడా దుర్భర పరిస్థితుల్లో కలం యోధులైన జర్నలిస్టులు జీవనం సాగిస్తున్నారని, వారి సమస్యలను కూడా ప్రభుత్వం అదే స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని జర్నలిస్టు సంఘాలతో జేఏసీ ఏర్పాటు

రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై సమష్టిగా పోరాడేందుకు అన్ని జర్నలిస్టు సంఘాలను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఐక్య వేదిక కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వివిధ జర్నలిస్టు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు కృషి చేస్తుందని చెప్పారు.

జర్నలిస్టులకు చట్టబద్ధంగా దక్కాల్సిన వేతనాలు, సంక్షేమ పథకాలు, అక్రిడిటేషన్లు, ఆరోగ్య కార్డులు, ఇంటి స్థలాలు, ఇతర హక్కుల సాధన కోసం డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది జర్నలిస్టులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పత్రికా యాజమాన్యాలు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా జర్నలిస్టులతో వెట్టి చాకిరీ చేయించుకోవడం దారుణమని విమర్శించారు. జర్నలిస్టులకు న్యాయంగా దక్కాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాల కోసం యాజమాన్యాలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.

డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

క్షేత్రస్థాయి జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా తమ సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాణా ప్రతాప్ తెలిపారు. డెస్క్‌లో పనిచేస్తున్న జర్నలిస్టుల పని పరిస్థితులు, వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు.

ప్రభుత్వం జర్నలిస్టులకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించేందుకు సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా చేసుకుని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మిస్తోందన్నారు.

ఏఐపై జర్నలిస్టులు పట్టు సాధించాలి

ప్రస్తుతం జర్నలిజం రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాణా ప్రతాప్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే జర్నలిస్టులు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రతి జర్నలిస్టు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఏఐ సాయంతో వార్తల సేకరణ, వార్తా రచన, సమాచార విశ్లేషణ, వార్తలను రూపొందించే విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని జర్నలిజంలో సమర్థవంతంగా వినియోగించుకునే పద్ధతులను ఆయన వివరించారు. అయితే సాంకేతికతను వినియోగించుకున్నప్పటికీ జర్నలిజంలో వాస్తవ నిర్ధారణ, నైతిక విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సంఘాన్ని మరింత విస్తరించాలి: రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.ఎస్‌. రావు

డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వరరావు (ఎన్‌.ఎస్‌. రావు) మాట్లాడుతూ రానున్న ఒకటి, రెండు నెలల్లో యూనియన్‌ను మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని, సభ్యత్వ నమోదును విస్తృతం చేయాలని కోరారు.

స్థానికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే సంఘం బలోపేతం అవుతుందని, ప్రతి జిల్లాలో స్థానిక సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ హెచ్‌. రామకృష్ణారెడ్డి, టీజేఏ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షుడు మణికుమార్, డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కో-కన్వీనర్లు ఎం.ఏ. అన్సార్ పాషా, ఎన్‌. రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో-కన్వీనర్ కోలే దామోదర్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, వివిధ జిల్లాల నాయకులు జాబిశెట్టి కుటుంబరావు, గోగుల నారాయణరావు, కట్టెకోల చిన్న నరసయ్య, మోడెపల్లి కిరణ్, ఏనిగండ్ల శ్రీనివాస్, నల్లా జగన్‌రెడ్డి, జానీ, వేర్పుల సాగర్, పొనకంటి ఉపేందర్, బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్, వుల్లోజి హరీష్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page