తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్
స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన బ్యాంకు సిబ్బంది
కరీంనగర్, అక్టోబర్ 1: పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం సాగించగలరని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం సప్తగిరి కాలనీలోని లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో బ్యాంకు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. గాలి, నీరు, నేలతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మానవాళి మనుగడకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
గ్రామీణ అభివృద్ధిలో టీజీబీ పాత్ర
గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 59 శాఖల ద్వారా సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరులో బ్యాంకు పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో బ్యాంక్ సీనియర్ మేనేజర్ (ఆపరేషన్స్) కందుల సుబ్బారావు, సీనియర్ మేనేజర్ బిజినెస్ కే. వంశీకృష్ణ, నోడల్ ఆఫీసర్ జి. మౌనిక, చీఫ్ మేనేజర్ జలంధర్ రెడ్డి, రమణారెడ్డి, మేనేజర్లు కొండపలకల వేణుమాధవ్, ఎం. ప్రవీణ్‌రెడ్డి, వివిధ శాఖల మేనేజర్లు, రీజినల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


