కరీంనగర్: మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
మహమ్మద్ ప్రవక్త జన్మించిన మాసాన్ని పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కరీంనగర్ మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నిర్వాహకులతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం వివిధ అంశాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన నమూనాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించేందుకు ఆర్థిక సహాయం చేయాలని నిర్వాహకులు కోరగా, గంగుల కమలాకర్ స్పందించి రూ.60 వేల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్నేహభావంతో, పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు యూసుఫ్, అలీ, నాయకులు గాదె శ్రీనివాస్, జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


