కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో అవినీతిపరుల నుంచి ఎన్ఫోర్పమెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన రూ. 3000 కోట్ల సొమ్మును ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకే పంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం చట్టపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ బెంగాల్ లోని బిజెపి ఎంపీ అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి ప్రచారంపై ఆరాధిస్తున్నారు.
ఇప్పటికే బసీర్ హాట్ బిజెపి అభ్యర్థి రేఖ పత్రాతో ప్రధాని మోడీ మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణానగర్ అభ్యర్థి రాజమాత అమృత రాయితో మాట్లాడారు. బెంగాల్ లోని పేద ప్రజల నుంచి అవినీతిపరులు రూ.3000 కోట్లు దోచుకున్నారన్నారు. ఈ మూడు వేల కోట్లను ఇప్పటికే ఈడీ జప్తు చేసిందని, ఈ సొమ్మును మళ్ళీ పేద ప్రజలకే పంచుతామని, అవసరమైతే చట్టపరమైన అవకాశాలు పరిశీలిస్తామని అమృతరాయికి ప్రధాని మోదీ చెప్పినట్లు బిజెపి స్థానిక నాయకులు తెలిపారు.