భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వచ్చే నెల 9న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా హోలీ పండుగ సందర్భంగా సోమవారం రామయ్యకు పంచామృతాలతో అభిషేకం, సహస్ర ధారలతో స్నాపన తిరుమంజసం చేసి పెళ్ళికొడుకుగా తయారు చేశారు. బేడా మండపంలో పూలతో అలంకరించిన ఊయలలో సీతారాములను ఆశీర్వణలు చేసి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు.
ముందుగా గర్భగుడిలో మూలవరులు, లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారిపై, ఆ తర్వాత బేడా మండపంలో ఉన్న సీతారాముల ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఇదే సమయంలో భక్తులపైన పసుపు నీళ్లు, రంగులు చల్లారు. వసంత రామయ్యకు నక్షత్ర కుంభాహారతులను సమర్పించారు. తర్వాత బేడ మండపం నుంచి సీతారాములను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రోలు, రోకలికి పూజలు చేశారు. పసుపు కొమ్ములను కట్టి వచ్చే నెల 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి వినియోగించే తలంబ్రాలు కలిపై పనులను ఈవో రమాదేవి ప్రారంభించారు.