Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కొందరు ఇప్పటికే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి పక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 53 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. బీజేపీ సైతం 52 మంది పేర్లను బయటపెట్టింది. కానీ మిగతా స్థానాలపై మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రతినిధుల నుంచి వస్తున్న సమచారం ప్రకారం నవంబర్ 2న మిగతా అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేస్తారని అంటున్నారు. నవంబర్ 1న పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ తరువాత నవంబర్ 2న జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్టపి వరకు 52 వాటికి అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాల్లో టికెట్ ఎవరికి వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన కొన్ని స్థానాల్లో అసంతృప్తి నెలకొంది.
సిరిసిల్ల నియోజకవర్గంలోని రమాకాంత్ రావు తనకు టికెట్ రాలేదని బీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యలో టికెట్ రాని వారు పార్టీ మారే అవకాశం ఉండడంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టికెట్ ఆశిస్తూ ప్రకటించని నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు నిరాశతో ఉన్నారు. నవంబర్ 3నే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే రెండో జాబితా రిలీజ్ చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.