హైదరాబాద్ (జనతా న్యూస్): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు ప్రారంభించాయి. తాజాగా వైఎస్ఆర్ టీపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మాత్రం తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటించింది. తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీ ఫాం లకోసం దరఖాస్తులు చేసుకోవాలని షర్మిల పార్టీ నాయకులకుసూచించారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ‘పాలేరుతో పాటు మరో చోట పోటీ చేయాలని ఉంది. అయితే అనిల్, విజయమ్మను పోటీ చేయించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా పోటీ చేస్తారు. మొన్నటి వరకు కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ ఆ పార్టీతో కలిసి వెళ్తే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని భావించాం. కానీ కొన్ని రోజుల పాటు వెయిట్ చేశాం. అయితే తాజాగా సమావేశం నిర్వహించిన తరువాత సొంతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాం’ అని షర్మిల ప్రకటించారు.