జాతీయ రహదారులపై ఫోకస్
సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష
రోడ్ల విస్తరణ టెండర్లు, భూ సేకరణపై బండి సంజయ్ సమీక్ష
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణ పనులు స్వీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసులో కరీంనగర్`జగిత్యాల, కరీంనగర్ `వరంగల్ జాతీయ రహదారుల విస్తరణ పనుల పురోగతిపై అదికారులతో సమీక్ష చేశారు. కరీంనగర్`జగిత్యాల జాతీయ రహదారి(ఎన్ హెచ్ 563) విస్తరణ పనుల టెండర్ ప్రక్రియ 15 రోజుల్లో ప్రారంభం కానుందని అధికారులు మంత్రికి తెలిపారు. కరీంనగర్ `జగిత్యాల రహదరి విస్తరణ పనుల టెండర్లు సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40 శాతం మేరకు పూర్తయ్యిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ నుండి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీయగా ‘‘ఇప్పటి వరకు 37 శాతం పూర్తయ్యాయని.. 2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు.’ మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తి వద్ద బైపాస్ లను నిర్మించనున్నట్లు తెలిపారు. 29 మైనర్ జంక్షన్లను నిర్మించనున్నామన్నారు. గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల లో భూ సేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిరదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్ లో మాట్లాడారు మంత్రి. కరీంనగర్ ఆర్డీవో ను పిలిపించి భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆయన సూచించారు. అట్లాగే కొన్నిచోట్ల సర్వీస్, స్ట్రక్చరల్ రోడ్ల ఏర్పాటుపై ప్రజల నుండి వినతులు అందుతున్నాయని అధికారులు పేర్కొనడంతో… ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు ఎన్ హెచ్ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు క్రిష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేశ్ త్రిపాఠి, కమలేశ్ పాల్గొన్నారు.