ఈ భోజనం తినలేక పోతున్నాం..
‘శ్రీ చైతన్య’లో విద్యార్థుల దయనీయ స్థితి
ఆందోళనలో పేరెంట్స్..కానరాని ఫుడ్ సేఫ్టీ అధికారులు
సిద్దిపేట-జనత న్యూస్
‘‘ పురుగులన్నం, నీళ్ల చారు, పులిసి పోయిన కూరలు..ఈ భోజనం చేయాలంటేనే భయమేస్తుంది. ఒకరోజు కాదు. ప్రతీ రోజు ఇలానే ఉంటుంది. ఇందులో ఉండలేం. మా ఇంటికి తీసుకెళ్లండి ’’ అంటూ ఇక్కడి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇదేదో ప్రభుత్వ హాస్టల్‌లోని సీన్ కాదు..
. ఓ ప్రముఖ కార్పోరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల గోడు. రూ. లక్షలు పెట్టి చదివిస్తూ, ఇలా నాసిరకం భోజనంతో విద్యార్థులు పడే ఇబ్బందులు ఇవి.
సిద్దిపేట జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్థ హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం విషయం తెలుసుకుని మీడియా అక్కడికి వెళ్లగా..ఆందోళన కరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ హాస్టల్‌లో ప్రతీ రోజు పెట్టే భోజనం ఎలా ఉంటుందో..ఆవేదనతో వెల్లడిరచారు పలువురు విద్యార్థులు. ఈ భోజనం తాము తినలేక పోతున్నామని తమను ఇక్కడి నుండి పంపించాలని మీడియా ఎదుట రోదిస్తూ తమ గోడు వెల్లబోసుకున్నారు. అన్నంలో పురుగులొస్తున్నాయని, పలువురికి అపెండెక్స్ ఆపరేషన్ సైతం అయిందని గుర్తు చేశారు. పురుగులన్నం, నీళ్ల చారుతో భోజనం చేయలేక పోతున్నామని, పేరెంట్స్‌కు చెబుదామంటే..తమను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. ప్రతీ రోజు..ఇలాంటి భోజనం చేయాలంటేనే భయమేస్తుందని ఆందోళన చెందారు.
అధికారుల తనిఖీలు కరువు
ప్రయివేటు హాస్టళ్లను ఎప్పటి కప్పుడు తనిఖీలు చేసి, నాణ్యతను పరిశీలించాల్సిన విద్యాశాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు..అడ్రల్ లేకుండా పోయారనే ఆరోపనలున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థ నిర్వహించే హాస్టల్‌ను ఇప్పటి వరకు ఎవరూ తనిఖీ చేయలేదని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇటు ముఖం కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపించారు.