Wednesday, July 2, 2025

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి.. పరాభవం !

సర్పంచ్‌ పదవి పోగానే సీన్‌ రివర్స్‌
పల్లె ప్రకృతి వనంలో చెట్ల తొలగింపు..
పంచాయతీ భవనానికి ఎదురుగా కందకాలు..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా చర్యలు శూన్యమట
ఆస్తులు కాపాడుకోవాలని గ్రామస్తులకు పిలుపు
సోషల్‌ మీడియాలో వైరల్‌..అధికార పార్టీలో కలవరం

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
‘‘ఆమె మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు రాలు, ఎంపీటీసీ, సర్పంచ్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అందరితో కలవడిగా ఉంటూ, సామాజిక సేవలోనూ ముందుంటారు. సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా అధికారులతో పోరాడి సాధించిన ప్రభుత్వఆస్తులు..అధికార పక్షంలోకి వచ్చాక పరాధీనం అవుతుండడం చూసి ఉండలేక పోతున్నట్లు వాపోతున్నారు. వీటిపై క్షేత్ర స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా చర్యలు శున్యమని అందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపనలు చేయలేక, ఇలా సోషల్‌ మీడియాలో పోస్టు ద్వారా గోడు వెల్లబోసుకున్నారు’’
కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట మాజీ సర్పంచ్‌, ప్రస్తుత డీసీసీ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి..జిల్లా ప్రజలకు సుపరిచితమే. అధికార పార్టీ సీనియర్‌ నాయకురాలిగా ప్రతిపక్షలంలో ప్రజా సమస్యలపై ఆమె అనేక పోరాటాలూ చేశారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుకుగా పని చేశారు కూడ. ప్రతిపక్షంలో పోరాడి సాధించుకున్న ఆమె..అధికారంలోకి వచ్చాక సాధించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఫలాలను కాపాడుకోలేక పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు..కాంగ్రెస్‌ వర్గాల్లో కలవరం రేపుతోంది.
సోషల్‌ మీడియాలో పోస్టు వైరల్‌
సర్పంచ్‌గా ఉన్న కాలంలో పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, వెసిన పెన్సింగ్‌, ఆట వస్తువులను తొలగించారట కొందరు. ముళ్ల తీగను కూడ తొలగించి హద్దు రాళ్లను చెరిపి వేశారని వాపోయారు మాజీ సర్పంచ్‌ కర్ర సత్య ప్రసన్నా రెడ్డి. పంచాయతీ భవనం స్లాబ్‌ వరకు నిర్మాణం జరగగా దారి లేకుండా కొందరు గోడ నిర్మించేందుకు ప్రయత్నిస్తురట. ఇంటి ఎదుట ఉన్న గుడిని తొలగించి విస్తరణ పేరుతో తమకు వాస్తు దోషం కలిగే విధంగా నిర్మాణానికి పూనుకుంటున్నారట. 2 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని తాము కాపాడితే..ప్రస్తుతం కొందరు కబ్జా చేశారట. వీటిపై తాను కార్యదర్శి, స్ఫెషల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ లకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని..సోషల్‌ మీడియాలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు కాపాడుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌ క్యాడర్‌లో కలవరం..
జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి సోషల్‌ మీడియా పోస్టు..ఆ పార్టీలో కలవరం రేపుతోంది. దీంతో క్యాడర్‌ గందర గోళంలో పడ్డారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ప్రభుత్వం నుండి మద్దతు ఉందా..లేదా..అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో..అధికార పార్టీ జిల్లా నాయకురాలి అసంతృప్తితో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు లేక పోలేదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో..అధిష్టానం ఏ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఒక దశలో రాజీనామాకు సిద్దం
సొంత గ్రామంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న తీరుపై ఒక దశలో రాజీనామాకు సిద్దమైనట్లు సమాచారం. గుడి విషయంలో సీపీకి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్ట రాదని నిర్మాణ దారులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు కార్యకర్తల నుండి ఒత్తిళ్లు పెరగడంతో ఒకడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page