Tuesday, September 9, 2025

కాలేశ్వరం జలాలు వచ్చేనా?

హుజురాబాద్, జనత న్యూస్:హుజురాబాద్ పాత తాలూకా ప్రాంతమంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ఆయకట్టు కింద సాగవుతోంది. 1980 వ దశకంలో వచ్చిన కాకతీయ కాలువ కింద ఆధారపడి వేలాది రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. కాకతీయ ఇక్కడి జీవన చిత్రాన్ని, శైలిని మార్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకతీయ రాకతో ఇక్కడి భూముల ధరలు పెరిగాయి. పచ్చటి పొలాలు, పాడి, పుట్లకొద్దీ పంట చేతికందుతోంది. ఎక్కడ చూసినా ధాన్యపురాసులు కనిపిస్తాయి.

మహారాష్ట్ర ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్ కు ముప్పు!

గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ వంటి ప్రాజెక్టులు నిర్మించడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడం కష్టమైంది. దీంతో చాలా కాలం పాటు శ్రీరాంసాగర్ నుండి సాగునీరు అందడం నిలిచిపోయింది. తద్వారా కాకతీయ ఆయకట్టు కింద రైతులకు తీవ్ర నష్టం జరిగేది. కేవలం వర్షాలు పడినప్పుడు మాత్రమే సమృద్ధిగా నీరందేది. యాసంగిలో సాగునీరు ఆయకట్టుకు అందక రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కాలేశ్వరం తో కరవు దూరం!

శ్రీరామ్ సాగర్ ఎండిపోయి, దిగువ మానేరులో కూడా నీళ్ళు లేని పరిస్థితిలో హుజురాబాద్ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది. వేసవిలో ట్యాంకర్లతో నీటి సరఫరా జరిగేది. కానీ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత హుజురాబాద్ ప్రాంతంలో పూర్తిగా కరువు తగ్గిపోయింది. చెరువులు కుంటలు అన్ని కాకతీయ కాలువ నీరు చేరి ఎప్పుడు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరులోకి అక్కడి నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా హుజురాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందేది. కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కాలేశ్వరం ప్రాజెక్టు రావడంతో.. కాలేశ్వరం ప్రాజెక్టు నుండి సాగునీరు ఎగువ మానేరుకు.. అక్కడినుండి దిగువ మానేరు కు వచ్చేది. దీంతో గత మూడేళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకు సాగునీరు అందుతోంది. అలాగే వరంగల్ తాగునీటి అవసరాలు కూడా వేసవిలో తీరుతున్నాయి.

ఈ ఏడాది పరిస్థితి ఏమిటో?

యాసంగి సీజన్ ముగిసి ఖరీఫ్ రాబోతోంది. దీంతో ఈ ఏడాది రెండు పంటలకు సరిపడా సాగునీరు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కాలేశ్వరంలోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడమే కారణం. మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తయితేనే ఎగువ మానేరు, మిడ్ మానేరు, కాకతీయ కాలువల ద్వారా హుజురాబాద్ తో పాటు వరంగల్ ఖమ్మం జిల్లాల రైతాంగానికి సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తి కాకుంటే మహారాష్ట్రలో సమృద్ధిగా వర్షాలు కురిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండితేనే నీరందే అవకాశం ఉంది. లేకుంటే అన్నదాత తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ రిజర్వాయర్ ను వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని రైతాంగం కోరుకుంటోంది. లేకుంటే రైతాంగం తమ భూములను పడావుగా పెట్టి, పంటలకు సరిపోయినంత సాగునీరు అందక, పంటలు ఎండిపోయి పెట్టుబడులు రాక దిగుబడులు రాక హుజురాబాద్ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయమే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చొరవ చూపించి మేడిగడ్డను వీలైనంత తొందరగా పునరుద్ధరించాల్సి ఉంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page