Tuesday, July 1, 2025

జిల్లా మారిన ఓటర్లు ఎటువైపు?

అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత?

హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి (జనతా న్యూస్): గత రెండు దఫాలుగా మానకొండూరు నియోజకవర్గం లో గులాబీ జెండా విజయ కేతనం సాగిస్తూ వస్తున్నది. ఈసారి గులాబీ పార్టీ గుబాలించేనా అనే మీమాంస పలువురిలో నెలకొంది మండలానికో సమస్య లాగా ప్రతి అంశం ఆ పార్టీని వెన్నాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత కొన్ని గ్రామాలు,మండలాలు సిద్దిపేట జిల్లాలో చేరడంతో కొన్ని వర్గాల ప్రజలు అసహనం, అసంతృప్తి లోనే ఉన్నారు.మొదట్నుంచి కరీంనగర్ లో కొనసాగిన గ్రామీణ,మండల ప్రాంతవాసులు నేటి పరిస్థితులను చూసి అసంతృప్తికి లోనవుతున్నారు.

స్థానికంగా నెల కొన్న సమస్యలను పరిష్కరించండి అంటూ అధికార పార్టీ నేతలను,ప్రతిపక్ష పార్టీ నేతలను కోరుతూనే ఉన్నారు.వివిధ రకాల నిరసనలను కూడా తెలియ చేస్తున్నారు…అయినప్పటికీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది..యువకుడు, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు తన సొంత గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలో కలుపుకునే ప్రయత్నంలో భాగంగానే బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో చేర్చారని సర్వత్రా వినిపిస్తున్న మాట.అయితే కరీంనగర్ తో ఉన్న బంధాన్ని,అనుబంధాన్ని పెనవేసుకున్న ప్రజలు ఆ పేగు బంధాన్ని తెంచుకోలేక తల్లడిల్లి పోతున్నారు. అనాదిగా ఒకే జిల్లాతో పెనవేసుకున్న అనుబంధంతో తాము సవతి తల్లి ప్రేమలో పడిపోయామనే భావనలో ఉన్నారు.ఇందుకు ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించిన పాపాన కూడా పోలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ రావు తమకు పెద్ద దిక్కుగా ఉంటారని భావించిన ఈ ప్రాంత వాసులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది.

bejjanki
bejjanki

కనీసం స్థిరమైన హామీలు,ఓదార్పు మాటలు కూడా కరువయ్యాయనే భావన ప్రజల హృదయాలలో నిండి ఉంది. ఓ వైపు స్థానికేతరుడయిన ఎమ్మెల్యే కూడా తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తి కొన్ని వర్గాలలో నెలకొంది.ముఖ్యంగా రాజకీయాలకతీతంగా,స్తబ్దంగా ఉండే బెజ్జంకి మండలప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వివిధ పనుల కోసం సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్ళితే తమను రెండవ శ్రేణి పౌరులుగా కూడా చూడటం లేదనే భావన కలుగుతున్నదని వాపోతున్నారు.గత పరిస్థితుల రీత్యా బెజ్జంకి మండలం ఆర్థికంగా చాలా వెనుకపడ్డ ప్రాంతం.ఇక్కడ మొదటి నుంచి విద్యకు,కుటీర పరిశ్రమలకు పెట్టింది పేరు. క్రీడలు,కళా, సాంస్కృతిక రంగాల పట్ల విశేష ప్రతిభ చూపిన వారు ఎందరో వున్నారు.అలాంటి వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఖ్యాతిని కూడా పొందారు.మరి కొందరు విద్యార్ధి దశ లోనే వివిధ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లలో పేరు పొందిన వారు కూడా ఉన్నారు.ప్రత్యేక తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నవారు కూడా వున్నారు.

కేసీఆర్ ఉద్యమ ప్రారంభంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ప్రచారం చేసిన వారు ఇప్పుడు వెనుక బెంచీ లో కూర్చోవాల్సి నదుస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో యువజన శాఖ మంత్రిగా వున్న హరీష్ రావు ను బెజ్జంకి మండలానికి మొదటి సారిగా రప్పించిన గత యువజన క్రీడాకారుల,రచయితల,జర్నలిస్టుల వూసు ఇప్పటికీ ఎక్కడా లేదు. అప్పటి నుంచి గుర్తించే ప్రయత్నమే జరుగలేదు.ముఖ్యంగా రాజకీయాలలో నియోజక వర్గంలో బెజ్జంకి మండలం ప్రాధాన్యతను తొక్కిపెడుతున్నారనే అపవాదు పలువురిలో నెలకొంది.ప్రతీ అంశం రాజకీయాలతో ముడి పడి వున్నందున అటు విద్యాధికుల్లో,ఉద్యోగ వర్గాల్లో,సామాన్యుల్లో ఏదో తెలియని అసంతృప్తి వున్నది.అయితే ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్ లో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టి హామీ ఇచ్చారు.

ఈ మేరకు పలు సార్లు రాస్తారోకోలు,నిరసనలు కూడా చేశారు.ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింతగా ప్రచారం చేస్తే గులాబీ పార్టీకీ కొంతనష్టం జరిగే ప్రమాదం వుంది.అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని,ఎలాంటి వివక్ష ఉండకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్డీవో స్థాయి కార్యాలయాన్ని,ట్రెజరీ సహా ఓ మినీ కోర్ట్ లాంటి సౌకర్యాల తో పాటు గతంలో ఇచ్చిన హామీలు డిగ్రీ కాలేజీ, పొలిటెక్నీక్ కళా శాల,100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ నెలకొలుపుతామని అందుకు స్థా నికుడుగా తనదే భాధ్యత అని హరీష్ రావు తీసుకుంటే గులాబీ రెపరెపలు సాధ్యమేనని విశ్లేషకుల అభిప్రాయం.ఇలాంటి చర్యలు చేపడితే ప్రజాబలం మరింత పెరగటంమే కాకుండా హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు కు మరింత దోహద పడుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page