- ప్రభుత్వం మారడంతో తగ్గిన గెలుపు ఆశలు
- కార్యకర్తల్లో బహిర్గతం అవుతున్న అసంతృప్తి
- రామమందిరం నిర్మాణంతో దేశ్జవ్యాప్తగా బీజేపీ కి పెరిగిన క్రేజ్
- ఎంపీ సీట్లతో సోనియాకు రిటర్న్ గిఫ్టని కాంగ్రేస్ ధీమా !
- ఈ సారీ బోయినపల్లి గెలుపు కష్టమేనంటున్న విశ్లేషకులు
కరీంనగర్, జనతా న్యూస్:
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అండగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది కూడా ఈ జిల్లాలోనే అనే చెప్పాలి. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్‌కు ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. ఉద్యమం సమయంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కరీంనగర్ జిల్లానే ఎంచుకునే వారు. రాష్ట్రం అవతరించి.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినన్నాళ్లు స్కీమ్‌లకు కూడా ఇక్కడి నుంచే అంకురార్పణ చేసే వారు. అదే నమ్మకంతో గతంలో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగానూ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన తరువాత వినోద్ కుమార్ బరిలో దిగినా.. ప్రజలు గెలిపించారు. కానీ.. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఝలక్ ఇచ్చారు. అపోజిషన్ క్యాండిడేట్ బీజేపీ నుంచి బరిలో నిలిచిన బండి సంజయ్ కుమార్‌కు గెలుపు వరించింది. అయితే.. మరో ఒకటి రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. మరి.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న వినోద్ కుమార్‌ను ప్రజలు ఆదరిస్తారా..? అసలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎలా ఉండబోతోంది..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
వినోద్‌పై పలు ఆరోపణలు
ఎంపీగా ఉన్నన్ని రోజులు బోయినపల్లి వినోద్ కుమార్ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదని అంటుంటారు. అలాగే.. ఏ కార్యకర్తకూ సమయం ఇచ్చేవారు కాదని చెబుతుంటారు. కొందరు కార్యకర్తలకు మాత్రమే ఆయన పెద్దపీట వేసేవారని అప్పట్లో గుసగుసలు వినిపిస్తుండేవి. అదేక్రమంలో పలువురు తన బంధువులకే పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే తన అన్న కూతురుకు జెన్ కోలో జాబ్ ఇప్పించినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించినా.. ఇప్పటికీ తనకు సంబంధించిన బంధువులకు పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సొంత ప్రతిమ ఫర్మ్‌కు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులకు వెంటవెంటనే క్లియరెన్స్ తెచ్చుకున్న ఆయన.. తన పార్టీకి చెందిన కార్యకర్తలు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రం పట్టించుకోలేదు. బిల్లుల కోసం కార్యకర్తలు ఎన్నిసార్లు ఆయన గడపతొక్కినా పెద్దగా పట్టించుకోలేదని వారిలో అసంతృప్తి నెలకొంది. ఇటీవల రేకుర్తిలో నిర్వహించిన సమావేశంలోనూ బీఆర్ఎస్ కార్యకర్త బాహాటంగా నిలదీయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
స్మార్ట్ సిటీ అక్రమాలపై నోరు మెదపరే..?
బీఆర్ఎస్, తన కృషి వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధ్యమైందని నిత్యం వినోద్ కుమార్ సభల్లో, సమావేశాల్లో చెప్తుంటారు. ఈయన చేసిన అప్పీల్‌ను సెంట్రల్ గవర్నమెంట్ స్వీకరించాల్సినా అవసరం లేదు. కానీ.. ఆ పార్టీకి చెందిన అభ్యర్థి ఇక్కడ ఎంపీ కావడంతో తన సొంత చరిష్మాతో డెవలప్మెంట్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన పెట్టిన ప్రతిపాదనలను తోసిపుచ్చకుండా స్మార్ట్ సిటీ నిధులను కానీ, తీగలగుట్టపల్లి ఆర్వోబీని కానీ కరీంనగర్‌కు తెప్పించిన తమ ఎంపీని ఏనాడూ వాళ్ల ప్రభుత్వం హయాంలో సముచిత గౌరవం ఇవ్వక పోగా తీవ్ర ఆరోపణలు చేయడం పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులను స్మార్ట్ సిటీ కింద తీసుకొస్తే ఇక్కడి ప్రభుత్వం పర్యవేక్షణలో జరగాల్సిన పనులు వందల కోట్లలో అవినీతి జరిగినా కనీసం నోరుమెదపలేదని, దానిని పక్కన పెట్టి ప్రతిసారి ప్రపోజల్ పెట్టిన దానికే నేనే తీసుకొచ్చా అని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ ప్రధానాస్త్రంగా వాడుతోంది. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పటికంటే బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పుడే సీఆర్ఎఫ్ మరియు పీఎంజీఎస్‌వై రోడ్లకు సంబంధించి ఎక్కువ నిధులు మంజూరయ్యాయని, దాని వల్లే చాలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న జగిత్యాల-వరంగల్ రోడ్డు కేవలం బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభానికి నోచుకుందని బీజేపీ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.
సామాజికవర్గం మద్దతు కరువు..
కరీంనగర్ నియోజకవర్గం వెలమలకు కంచుకోటగా ఉండేది. అలాంటి గత కొన్ని టర్మ్ ల నుంచి బీసీలకు అడ్డగా మారింది. ఎమ్మెల్యేగా గంగుల కమాలకర్, అటు ఎంపీగా బండి సంజయ్ కుమార్ ఇద్దరు బీసీలు.. అందునా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీసీ జెండా పాతారు. ఇప్పటికి ఇక్కడ వెలమ సామాజికవర్గానికి మంచి పట్టు ఉంది. కానీ, అదే సామాజికవర్గం వినోద్ కుమార్‌ను మాత్రం స్వాగతించడం లేదు. తన సామాజికవర్గానికి కానీ.. వ్యక్తిగతంగా కానీ సపోర్టు చేయకపోవడంతో వారి మద్దతు కరువైందని చెప్పొచ్చు. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు అనేక సమస్యలను ఆయనను వెంబడించడంతో ఆయన గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠామకంగా భావిస్తున్న రాజకీయ దురందురుడు కేసీఆర్ తన చాణక్య నీతిని ప్రదర్శించి మరోమారు కరీంనగర్‌ను కేంద్రంగా చేసుకొని ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ చతురతతోపాటు, ఎదురులేని నేతగా ఉన్న గంగుల కమలాకర్ తనకున్న క్యాడర్ సహాయసహకరాలు అందిస్తే తప్ప అద్భుతం జరగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ ఖాతాలో అయోధ్య..
దశాబ్దాల నిరీక్షణ తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మితమైంది. ఆ రామమందిరం అంకురార్పణకు ముందు దేశవ్యాప్తంగా ఇంటింటా అక్షింతలు పంపిణీ చేశారు. దీంతో హిందుత్వాన్ని నిలిపే పార్టీ బీజేపీ అనే విశ్వాసాన్ని ఆ పార్టీ బలంగా నిపింది.అటు రామయ్య ఆశీస్సులు.. ఇటు మోడీ చరిష్మా తమ పార్టీకి కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సంజయ్ గెలుపునకు కారణమవుతుందని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి.
ఎంపీ సీట్లతో సోనియాకు రిటర్న్ గిఫ్టని కాంగ్రేస్ ధీమా !
తెలంగాణ ఇచ్చింది సోనియానేనని ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దమొత్తంలో ఎంపీ సీట్లతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పథకం వేస్తున్నాయి . కాగా
ఉమ్మడి జిల్లా నుండి ఇద్దరు మంత్రులు రాష్ట్ర కేబినేట్లో ఉండటంతో సవాలుగా తీసుకొని కరీంనగర్ ఎంపీ స్థానం ను సునాయాసంగానే కైవసం చేసుకుంటారని కాంగ్రెస్ భావిస్తోంది
