- గంగులకు గట్టిపోటీ ఇవ్వనున్నారా?
- సామాజిక వర్గ ఓట్లలో చీలిక?
- కాంగ్రెస్ లో కొత్త జోష్
(యాంసాని శివ కుమార్ , ఎడిటర్)
తెలంగాలో కరీంనగర్ జిల్లా రాజకీయంగా ప్రత్యేకత చాటుకుంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఇక్కడ తన బలాన్ని చూపించేందుకు రెండు సార్లు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటి నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఎమ్మెుల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి గెలుస్తూవస్తున్నారు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎం. సత్యనారాయణ గెలిచారు. ఎందుకంటే కరీంనగర్ అనగానే వెలమల కోట అని ప్రసిద్ధి చెందింది. కానీ 2009 నుంచి ఆ పరిస్థితి మారింది. వెలమ కోట నుంచి బీసీ లకు కంచుకోటగా ఎదిగింది. ఇక అప్పటి నుంచి బీసీల్లోనే పోటీ పెరిగింది.
బీసీలు ఎక్కువే..
కరీంనగర్ జిల్లాలో ఉన్న బీసీల్లో మున్నూరు కాపులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో ఆయన గెలుస్తూ వస్తున్నారన్న వాదన ఉంది. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బండి సంజయ్ కార్పొరేట్ స్థాయి నుంచే ప్రజాబలం పెంచుకున్నారు. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని 2014, 2018లో పోటీ చేశారు. మొదటి సారి కంటే రెండోసారి బండిసంజయ్ గట్టి పోటీ చేశారు. అయితే బండి సంజయ్ కుడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం.
ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్
2023 ఎన్నికలు మరింత ప్రత్యేకత చాటుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ హవా సాగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ రాకతో కాంగ్రెస్ మూడో స్థానికి పడిపోయింది. ఒక దశలో కాంగ్రెస్ కు నాయకులు కరువయ్యారు అని అనుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల సర్పంచ్ కు టికెట్ కేటాయించడం ఆసక్తిగా మారింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొత్తజయపాల్ రెడ్డి చేరారు. దీంతో పార్టీ ప్రతిష్టత పెరిగిందని అనుకున్నారు. కానీ ఆ తరువాత పార్టీ ఆచితూచి వ్యవహరించింది.
బీసీ నేత కోసం చూసిన కాంగ్రెస్
అప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి గంగుల కమలాకర్ కు టికెట్ కేటాయించారు. ఆ తరువాత బీజేపీ నుంచి బండి సంజయ్ కు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటి వరకు జయపాల్ రెడ్డికి టికెట్ ఇస్తామని భావించిన అధిస్ఠానం బీసీ నేత ను బరిలోకి దింపాలని అనుకుంది. ఇద్దరు బీసీ నేతలు బరిలో ఉన్నందున మరో బీసీ నేతకు టికెట్ ఇస్తేనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నిర్ణయించింది. 2018లో అలాగే భావించి పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఇచ్చారు. కానీ ఈ సారి ఆయన హుస్నాబాద్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు.
‘పురమల్ల’కు కలిసొచ్చిన అదృష్టం
ఈ తరుణంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పురమల్ల శ్రీనివాస్ అధిష్టానాన్ని కలిసి టికెట్ ఇవ్వాలని కోరారు. పలుమార్లు అధిష్టానాన్ని కలుస్తూ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అనుకున్నట్లుగానే పురమల్ల శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. పురమల్ల శ్రీనివాస్ క టికెట్ ఇస్తే పార్టీ చిన్నా భిన్నం అవుతుందని కొందరు ప్రచారం చేశారు. కానీ అందుకు వ్యతిరేకంగా ప్రజాబలం పెరిగిందని అంటున్నారు. ఆయన ఇటీవల నగరం నడిబొడ్డున నిర్వహించిన ప్రచారానికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అందుకు తోడుగా సీపీఐ నాయకులు కూడా మద్దతు ఇవ్వడం పార్టీ ప్రతిష్టత పెరిగినట్లు తెలుస్తోంది.
గంగులకు గట్టిపోటీ?
ఈ పరిస్థితుల్లో కేవలం గంగుల కమలాకర్, బండి సంజయ్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పురమల్ల శ్రీనివాస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కరీంగర్ లో త్రిముఖ పోరు సాగనుంది. మరో విశేషమేంటంటే గంగుల కమలాకర్, బండిసంజయ్ తో పాటు పురమల్ల శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో పోటీ మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఓట్లు చీలే అవకాశం?
గంగుల కమలాకార్, బండి సంజయ్ మధ్య పోటీ ఉంటే బండి సంజయ్ కి కొన్ని ముస్లిం ఓట్లు కోల్పోయేవారు. దీంతో గంగుల కమలాకర్ గెలుపు సునాయాసం అయ్యేది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పురమల్ల శ్రీనివాస్ కొన్ని వర్గాల ఓట్లను చీల్చడం ఖాయమని అంటున్నారు. దీంతో గంగుల కమలాకర్ గెలుపు కష్టతరంగా మారింది. మొన్నటి వరకు నాలుగోసారి ఈజీగా గెలుస్తామనుకున్న గంగుల కమలాకర్ కు కేవలం బండి సంజయ్ మాత్రమే కాదు.. ఇప్పుడు పురమల్ల శ్రీనివాస్ నుంచి కూడా ముప్పు ఉందని అనుకుంటున్నారు.
పెరుగుతున్న క్రేజీ..
పురమల్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్ గా ఓ ప్రాంతంలో ప్రజాదరణ పొందిన వ్యక్తి. అయితే ఆయన కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడంతో ఆ పార్టీలో వెళ్లూనుకొని ఉన్నవారికి మరింత బలం పెరిగింది. గంగులపై తీవ్ర వ్యతిరేకతతోనే తాను బరిలోకి దిగినట్లు చెబుతున్న పురమల్ల శ్రీనివాస్ కు ఒకప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వారి మద్దతు ఉండేది. కానీ ఇప్పడు నియోజకవర్గంలో ఆయనకు మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. గట్టిగా ప్రయత్నిస్తే పురమల్ల గెలుపు కూడా పెద్ద విషయం కాదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. అందుకోసం పార్టీ శ్రేణులు ఒక్కటే తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.