ఈ ముగ్గురి ఎమ్మెల్యేల భవిష్యత్ ?
జనత న్యూస్ :
ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిల భవిష్యత్ ఏంటి ? నాలుగు వారాల్లో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు ? ఆ తరువాత ఏం జరగనుంది ? ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ వేసిన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీఆర్‌ఎస్ నుండి మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినా, ఈ ముగ్గిరిపై మాత్రమే అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేయడం, తాజాగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఈ రోజు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. హైకోర్టు ఆదేశాలను బీఆర్‌ఎస్ స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ కార్యచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ స్వీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనర్హత వేటు వేసి ఉప ఎన్నికకు దారి చూపుతారా..నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తారా..అనేది తేలాల్సి ఉంది. అయితే..హైకోర్టు సుమోటోగా స్వీకరించి నిర్ణయం తీసుకునే వరకు మరికొంత కాలం పట్టే అవకాశాలుంటాయని పలువురు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే పని పూర్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేస్తారా..అనేది వేచి చూడాలి.