బెజ్జంకి టౌన్ ,జనతా న్యూస్:గత పది సంవత్సరాల క్రితం ఎంపీగా ఉండి తాను చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను డిమాండ్ చేశారు. ఆయన సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు గ్రామాలలో ప్రజాహిత యాత్ర లో పాల్గొని జరిగిన సమావేశాలలో మాట్లాడారు కోహెడ మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గుండారెడ్డిపల్లి నుండి ముత్తన్నపేట మీదుగా బస్వాపూర్ వరకు మూడు కోట్ల 74 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డును వేయించింది తానేనని తేల్చి చెప్పారు. బియ్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్లు, హరితహారం ఇలాంటివి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వానివే అని అన్నారు.

రామాలయ అక్షింతలను సైతం తప్పు పట్టే సంస్కృతి కాంగ్రెస్ నేతలదని, అవి రేషన్ బియ్యమా , బాస్మతి బియ్యమా , మసూరి బియ్యామా అని ఎద్దేవా చేయటం వారికి తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తా మన్న మహిళల ఆసరా పింఛన్లు నాలుగువేలు ఏవని, రైతుబంధు, రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా ఎప్పుడు ఇస్తారో వారికే స్పష్టత లేదని తేల్చి చెప్పారు. తాను ఏలాంటి అభివృద్ధి చేయలేదని అనేవారికి నాపై బి ఆర్ ఎస్ పార్టీ మోపిన 100 కేసులే వాటికి నిదర్శనాలు అన్నారు . అవన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లు పెట్టించినవని ఆయన ఆరోపించారు. తాను నిరుద్యోగ యువత కొరకు ఉద్యోగ ఉపాధ్యాయుల 317 జీవో కొరకు రైతు రుణమాఫీ మహిళలపై జరుగుతున్న అత్యాచారల నివారణకై దళిత బంధుకోసమై ఇలాంటివి ఎన్నో ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రజాయాత్ర కార్యక్రమంలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోహెడ మండల పార్టీ అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, ఎర్ర మహేష్, మధుకర్, మామిడి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు