Wednesday, July 2, 2025

నేత బజార్‌ నిర్వహణ గాలికి..

నెలకు రూ. 80 వేల వరకు ఆదాయం
కనీసం మూత్రశాలల్లేవు..
అధికారుల పర్యవేక్షణ శూన్యం

జనతన్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
నేత బజార్‌లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ‘నేత బాజర్‌ వస్త్రోత్పత్తి, విక్రయ దారుల సంక్షేమ సంఘం’ పేరుతో ప్రతీ శనివారం హోల్‌సేల్‌, రిటేల్‌ వ్యాపారుల వద్ద నుండి మెయింటెన్స్‌ పేరుతో రుసుం వసూలు చేస్తున్నారు. అద్దెలు, గోదాం, క్యాంటీన్‌ రూపంలో వచ్చిన ఆదాయం మొత్తం నెలకు సుమారు రూ. 80 వేలు వసూలు చేస్తున్నారు. ఆదాయం బాగానే వచ్చినా..నిర్వహణ మాత్రం శూన్యం. కనీసం తాగునీరు, మూత్ర శాలలు ఏర్పాటు చేయక పోవడంతో ఇక్కడి వ్యాపారులు, వినియోగ దారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీనిపై ఇటు మున్సిపల్‌, అటు చేనేత జౌళిశాఖ అధికారుల పర్యవేక్షణ లేక పోవడం విశేషం. కరీంనగర్‌ నడీ బొడ్డున సుమారు 16 ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవహారంపై జనత ప్రత్యేక కథనం.

నగర నడీ బొడ్డున వీక్లీ మార్కెట్‌ సమీపంలో 2008లో నేత బజార్‌ను ప్రారంభించారు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేకర్‌ రెడ్డి. చేనేత పారిశ్రామికులు తమ ఉత్పత్తులు విక్రయించుకుని ఉపాధి పొందేందుకు అప్పటి ప్రభుత్వం..దీన్ని నిర్మించి ప్రారంభించింది. ప్రతీ శనివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పవర్‌ లూమ్‌ పారిశ్రామికులు, ఇతర వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుండి హోల్‌సేల్‌, రిటైల్స్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా..నిర్వహణ లోపంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షానికి నేత బజార్‌ అవరణ మొత్తం బురద మయంగా మారుతోంది. వ్యాపారుల కోసం వేసి హాళ్లు పగుళ్లు చూపాయి. కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. వ్యాపారులు, వినియోగ దారుల కోసం కనీసం మూత్ర శాలలు కూడ ఏర్పాటు చేయక పోవడంతో నిర్వాహకులపై విమర్షలు వెల్లువెత్తుతున్నాయి.
నేత బజార్‌ నిర్వహణ చేనేత జౌళిశాఖ అధికారులే చూడాల్సి ఉన్నా..రాజకీయ ఒత్తిళ్లతో వారు వదిలించుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు నేత బజార్‌ను హ్యాండోవర్‌ చేసుకున్నారు. వారు చెప్పిందే వేదంలా కొనసాగుతోంది. శనివారం సుమారు 300 మంది వ్యాపారుల నుండి రూ. 40ల చొప్పున నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్నారు. దీనికి తోడు గోదాంలు, క్యాంటీన్‌, నాలుగు షర్టర్ల నుండి నెల వారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు సుమారు రూ. 80 వేల వరకు ఆదాయం వస్తోంది. ఇలా 16 ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ ఆదాయంతో వ్యాపారులు, కొనుగోలు దారులకు సౌకర్యాలు కల్పించాల్సిన నిర్వాహకులు..ఇవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపనలున్నాయి.
పేరుకే కమిటీ..?
‘నేత బాజర్‌ వస్త్రోత్పత్తి, విక్రయ దారుల సంక్షేమ సంఘం’ పేరుకే. కాని నిర్వహణ మాత్రం ఒకరిద్దరి చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. సుమారు 16 సంవత్సరాలుగా నేత బజార్‌లో.. నిర్వహణ పేరుతో రుసుం వసూలు చేస్తున్నా..ఇప్పటి వరకు ఏ లెక్క అటు అధికారులకు గాని, ఇటు వ్యాపారులకు గాని చెప్పక పోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది. నిర్వహణ, రుసుం వసూలు, ఆదాయ వ్యయాలపై అనేక మార్లు కొందరు వ్యాపారులు నిర్వాహకులను ప్రశ్నించినప్పటికీ, సమాదానం రాలేదని ఒకరిద్దరు వ్యాపారులు ‘జనత’తో వాపోయారు. గతంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేత బజార్‌ అభివృద్ధి కోసం సుమారు రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారని, అవసరమైతే మరిన్ని నిధులు తన కోటా నుండి కేటాయిస్తానని హామీ ఇచ్చినా, పనులు చేయించేందుకు ఎవరూ ముందుకు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏసీబీచే దర్యాప్తు చేయించాలి
పొరండ్ల రమేశ్‌, పద్మశాలి సంఘం ప్రతినిధి
16 సంవత్సరాలుగా నేత బజార్‌ నిర్వహణపై ఏబీసీ అధికారులచే విచారణ జరిపించాలి. ఇందులో అనేక గోల్‌మాల్‌ జరిగినట్లు తమకు సమాచారం ఉంది. వ్యాపారులు, కొనుగోలు దారులకు మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి లక్షల్లో ఆదాయం వస్తున్నా, కనీస సౌకర్యాలు కూడా కల్పించ లేక పోతున్నారు. వెంటనే నిర్వాహకులను ఇందులో నుండి తప్పించి, సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page