Saturday, September 13, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్న చోట ఓట్లు అడగం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • లేనిచోట బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటదా…
  • ఎంపీలుగా బండి, వినోద్ ఏం చేశారు
  • రాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుక్కోంటోండి
  • నుస్తులాపూర్ తో కార్నర్ మీటింగ్ లో పొన్నం

తిమ్మాపూర్, జనతా న్యూస్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లున్న చోట కాంగ్రెస్ పార్టీగా మేము ఓట్లు అడగం… లేనిచోట బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటదా అంటూ రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో కార్నర్ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంధర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మంత్రి పొన్నం మాట్లాడుతూ… ఎంపీలుగా బండి సంజయ్, వినోద్ కుమార్ కరీంనగర్ కి, నుస్తులాపూర్ కి ఏమైనా చేశారా, చేస్తే చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాకముందే అన్నీ గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు ఉన్నాయని, హనుమాన్ చాలిసా చదవనివ్వరని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులకు బుద్ది ఉందా అంటూ మండిపడ్డారు. రాముడి పట్టాభిషేకం కాకముందే గ్రామాల్లో అక్షింతలు పంచిన బీజేపీ నాయకులు రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రోడ్ల కూడళ్ల వద్ద ఫోటోలు పెట్టి డబ్బులు అడుకుంటున్నట్లు… బీజేపీ నాయకులు రాముడు ఫోటోలు పంచుతూ ఓట్లు అడుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేస్తూనే, దేశానికి, రాష్ట్రానికి మోడీ ఏమైనా చేస్తే ఆయన ఫోటో పెట్టి ఓట్లు అడగాలంటూ సూచన చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 60 వేల కోట్ల అప్పు ఉంటే కేసీఆర్ దిగి పోయే నాటికి 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ర్ట ఖజానాను ఖాళీ చేశారని అన్నారు. అయినా ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత బస్సు, రూ.500లకే సిలిండర్, ఉచిత కరెండు హామీలను నెరవేర్చిందని, ఆగష్టు 15 వరకు రుణ మాఫీ చేస్తామని, ఎన్నికల తరువాత రేషన్ కార్డులు ఇస్తామని పొన్నం ప్రకటించారు. బీ ఫారం తీసుకున్న తరువాత మొదటిసారి నుస్తులాపూర్ లో ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నామని, తిమ్మాపూర్ మండల ప్రజలు అత్యధిక మెజార్టీని అందించి వెలిచాల రాజేంధర్ రావును గెలిపించాలని కోరారు.

ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంధర్ రావు మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలో తన తండ్రి జగపతిరావు ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ది పనులు చేశారని గుర్తు చేశారు. వినోద్ కుమార్ ఎంపీగా సామాన్యులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగి రాష్ర్టాన్ని దివాలా తీశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించి భార్యాభర్తల మాటలు విన్న కేసీఆర్ మూర్ఖుడన్నారు. దేవుళ్ల పేర్లు చెప్పి బిజెపి పార్టీ నాయకులు మత రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో శ్రీ రామచంద్రుని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉన్నాయని తెలిపారు. బిజెపి పార్టీ దళిత సమాజాన్ని చిన్న చూపు చూస్తుందని, ఈ ఎన్నికల్లో దళితులంతా బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బిజెపి పార్టీ మళ్ళీ అధికారంలోకి భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ర్టానికి నిధులు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను తీర్చుతామని, ఇండ్లను నిర్మించి తీర్చుతుందని తెలిపారు. కార్యక్రమంలో నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాసరావు, జూగుండ్ల మాజీ సర్పంచులు సాయిల్ల రేణుక, ఎల్లేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెరపెల్లి రమణారెడ్డి, బ్లాంక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ తోపాటు తిరుపతిరెడ్డి, బండారి రమేష్, నాయకులు శ్రీగిరి రంగారావు, కొండాల్ రావు, చింతల లక్ష్మారెడ్డి, బుదారపు శ్రీనివాస్, బుడిగె కొండయ్య, గంకిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page