- కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులున్నయ్…
- *నేను పక్కా లోకల్… వినోద్ నాన్ లోకల్… *
- బండి సంజయ్ నామినేషన్
- హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కరీంనగర్, జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు… వందల కోట్లు ఖర్చు చేయడానికి వచ్చినోళ్లు… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు.. నాకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవు.. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. వాళ్లకు ఆస్తి కోట్ల రూపాయలు… కానీ నా ఆస్తి మీరే… వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు.. నేను మీ కోసం కొట్లాడి వేల కేసులు పెట్టినా భయపడనోన్ని…గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డ బండి సంజయ్ కావాల్నా గుండెమీద చేయి వేసుకుని ఓటేయండి.. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ కేసీఆర్ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని పేర్కొన్నారు. బీజేపీ హైకమాండ్ నాకు టిక్కెట్ ఇవ్వగానే… మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్ బిడ్డగా నామినేషన్ దాఖలు చేసిన. మోదీని మళ్లీ ప్రధానిగా చేసే అవకాశం కోసం కరీంనగర్ లోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని, భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని కోరుతున్నా. మీరు నన్ను గెలిపిస్తే నేను మోదీకి ఓటేస్తా… కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి ఓటేస్తరు.. ఎవరు కావాలో తేల్చుకోండి.. అని తెలిపారు.
‘నేను మీ బిడ్డను. పక్కా లోకల్. మీరు పెంచి పోషించిన బిడ్డను. మీకోసం నిరంతరం కొట్లాడుతున్న. మీ కోసం లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా మీకు అండగా నిలిచిన. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లిన. 317 జీవోకు నిరసనగా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే నా ఆఫీస్ బద్దలు కొట్టి కేసీఆర్ గుంజుకుపోయి జైళ్లో వేసినా భయపడలే… ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడింది నేను. అగ్రవర్ణాల పేదల కోసం పోరాడింది నేను.. ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) టీంలో బీజేపీకి మోదీ కెప్టెన్. ఆ టీంలో మేమంతా సభ్యులుగా వస్తున్నాం… మరి కాంగ్రెస్ టీంకు ఎవరు కెప్టెన్ ఎవరు? కెప్టెన్ లేకుండా బరిలో దిగుతున్న టీంను పట్టించుకునేదెవరు? ఇక్కడున్న మంత్రి ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు.. మాట్లాడితే తన్నుడు..గుద్దుడు… వెధవ అంటూ తిట్టడం తప్ప సాధించేదేమీ లేదు…’ అని అన్నారు.
