- పెద్ద ఎత్తున ఓటేసిన ప్రజలు
కరీంనగర్,జనతా న్యూస్: పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో పోలింగ్ ప్రక్రియ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవహాల్లో సాఫీగా సాగింది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ 67.67 శాతం నమోద యింది. పార్లమెంట్ పరిధిలో 2194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 17,97,150 మంది ఉన్నారు, ఇందులో పురుషులు 8,77,483, మహిళలు 9,19,565 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 102 మంది, ఓవర్సీస్ ఎలక్ట్రోస్ 178, 18 నుంచి 19 సంవత్సరాల మధ్య యువత 46,701 మంది, సర్వీస్ ఎలక్టోర్స్ 1018 మంది ఉన్నారు.. 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 10.01, 9 నుంచి 11 గంటల వరకు 26.14 శాతం, 11 గంటల నుంచి ఒంటిగంట వరకు 45.11 శాతం, ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు 58.24 శాతం, మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు 67.67 శాతం పోలింగ్ నమోదయింది. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా చూస్తే సాయంత్రం ఐదు గంటల వరకు కరీంనగర్ నియోజకవర్గంలో 55.82 శాతం పోలింగ్, చొప్పదండిలో 70.13, వేములవాడలో 71.26, సిరిసిల్లలో 69.58, మానకొండూర్ లో 71.11, హుజురాబాద్ లో 68.67, హుస్నాబాద్ నియోజక వర్గంలో 73.63 శాతం పోలింగ్ నమోదయింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరీంనగర్లో మహిళా డిగ్రీ, వానినికేతన్ డిగ్రీ కళాశాల, ముక్రాంపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. చొప్పదండిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మానకొండూర్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్లో ఆర్డిఓ కే మహేశ్వర్, హుజురాబాద్ లో ఆర్డీవో రమేష్ బాబు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించు కున్నారు. వయో వృద్ధులు, దివ్యాంగులు కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్ ఏర్పాటు చేశారు. వాహన సౌకర్యం సమకూర్చారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2194 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్స్ యూనిట్లు 5500, కంట్రోల్ యూనిట్లు 2743, వీవీ ప్యాట్స్ ను 3077 ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది 10,200 మంది విధులు నిర్వర్తించారు. సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు కరీంనగర్ లోని స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ అధికారులు, సిబ్బంది తగిన భద్రత మధ్య వాహనాల్లో ఈవీఎం లను కరీంనగర్ కు తరలించారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, అధికారులు పర్యవేక్షించారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు నిఘా ఉండనుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.