ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
వేములవాడ గుడి చెరువు, ఇతర స్థలాల పరిశీలన
వేములవాడ-జనత న్యూస్
భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయస్థానం, పోలీస్ అధికారుల సూచనలను మండపాల నిర్వాహకులు, యువత, ప్రజాప్రతినిధులు పాటించి, సహకరించాలని కోరారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్స్‌లు పెట్టుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్, సెస్, మత్స్య, పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. కావాల్సిన క్రేన్స్, జేసీబీలు, విద్యుత్ దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని కమిషనర్ ను, సెస్ అధికారులను ఆదేశించారు. విగ్రహాలు వెళ్లే దారిలో తీగలు ఎత్తు పెంచి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి తరలించి, సహకరించాలని కోరారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి లైఫ్ జాకెట్లు సమకూర్చాలని, ఎక్సైజ్, అగ్ని మాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ విప్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రామ తీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, రాజ రాజేశ్వర స్వామి దేవాలయ ఈఓ వినోద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, తహసిల్దార్ మహేష్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేములవాడలో 16న వినాయక నిమజ్జనం

- Advertisment -