- నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ నాయకుల్లో తొలగిన ఉత్కంఠ
- మంత్రి పొన్నం ప్రభాకర్ తోడుండడంతో మరింత ఉత్సాహం
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై మొత్తానికి ఉత్కంఠ తొలగినట్లేనని తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ తరుపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంతో ఇక ఆయనే పార్టీ అభ్యర్థి అని డిక్లేర్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రిపొన్న ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో పార్టీ నాయకుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని తెలుస్తోంది. అయితే అధిష్టానం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఒకింత అయోమయమే నెలకొంది. పార్టీలోని ఓ వర్గం దీనిపై తీవ్రంగా చర్చలు పెడుతున్నట్లుతెలుస్తోంది. అయితే వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కు దాదాపు పార్టీలోని ముఖ్యనాయకులు హాజరు కావడంతో ఓవరాల్ గా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో పలువురి పేర్లు వినిపించినా టికెట్ ఎవరికి వస్తుందోనని ఎదురుచూశారు. కానీ సోమవారం నామినేషన్ కార్యక్రమంతో ఉత్కంఠ తొలగినట్లేనని చర్చించుకుంటున్నారు.
కరీంనగర్ ను కోహినూర్ లా మార్చుకుందాం
నామినేషన్ సందర్భంగాకాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
తనకు ఓ అవకాశం ఇచ్చి గెలిపించాలని, కరీంనగర్ ను కోహినూర్ లా మార్చుకుందామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అత్యంత అట్టహాసంగా, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వెంట తరలి రాగా రాజేందర్ రావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, డైనమిక్ మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే కరీంనగర్ ను కోహినూరులా మార్చుకుందామని పేర్కొన్నారు. తన తండ్రి దివంగత జగపతిరావుకి కరీంనగర్ జిల్లా ప్రజలతో సుమారు 40 సంవత్సరాల అనుబంధం ఉందని, గత పది సంవత్సరాల నుండి తాను కూడా వివిధ హోదాల్లో ఉడతా భక్తిగా సేవ చేశానని గుర్తు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ మంచినీటి సదుపాయంలో మా తండ్రి పాత్రను నేటికీ ప్రజలు మర్చిపోలేరని, తనను ఎంపీగా గెలిపిస్తే అదే స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ వారికి సేవ చేసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో అంటుంటే.. బిజెపి మాత్రం భారత్ తోడో అంటుందని విమర్శించారు. ఇప్పటికే బిజెపి టిఆర్ఎస్ లతో ప్రజలు విసిగిపోయారని, మార్పులో భాగంగా తొలుత తెలంగాణలో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్లే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, మహిళల కోసం రూపొందించిన పథకాలు గర్హనీయమని కొనియాడారు. గతంలో ఎంపీలుగా పనిచేసిన బోయినపల్లి వినోద్, బండి సంజయ్లు ప్రజల పట్ల చులకన భావం చూపించారని అందుకే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నియోజకవర్గ ప్రజలను కోరారు.