- గుమ్మడికాయ దిష్టి తీసి.. కిరీటం తొడిగి..
- రాజేందర్ రావు గెలుపుకు నీరాజనం పలికిన సొంత గడ్డ..
- యుద్దానికి సిద్ధం చేసిన గుండి గోపాలరావుపేట గ్రామస్తులు..
కరీంనగర్, జనత న్యూస్: ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి.. ఇక మిగిలింది ఎన్నికల ప్రక్రియ మాత్రమే. ఎన్నికల ప్రచారం చివరి రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తన స్వగ్రామమైన గుండి గోపాలరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ శివారులో మంగళ హారతి తో స్వాగతం పలికిన స్థానిక మహిళలు, గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ సందర్భంగా స్థానిక యువత రాజేందర్ రావు ఎంపీగా గెలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెబుతూ బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం నడుచుకుంటూ గుండి గోపాలరావుపేటలో ప్రచారం నిర్వహించిన రాజేందర్ రావు ప్రజలను ఓట్లనభ్యర్థించారు. అనంతరం ప్రచార రథం పై గోపాలరావుపేట వరకు రోడ్ షో నిర్వహించారు. గోపాలరావు పేటలోని తన కుటుంబం నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, స్థానిక పెద్దలు రాజేందర్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూడు రంగుల కిరీటాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ రావు తలకు ధరించి, శాలవాలు, పూలదండలతో సత్కరించి రోడ్ షో ని ప్రారంభించారు. అక్కడి నుండి గోపాలరావుపేట బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ రావు ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగరు. అనంతరం బస్టాండ్ సెంటర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. సొంత గడ్డపై తనకున్న మామకారాన్ని చాటుకునేలా గుండి గోపాలరావుపేట గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు.