Thursday, September 11, 2025

వైభవోపేతంగా శరన్నవరాత్రోత్సవాలు..

మహాశక్తి ఆలయంలో జాతర
భవానీలు, భక్తులతో కిట కిట లాడుతున్న మండపాలు
అమ్మవార్ల సన్నిధిలో కేంద్ర మంత్రి సంజయ్‌..
వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ప్రత్యేక పూజలు..
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా వీధుల్లోని మండపాలు, దేవాలయాలు భవనీలు, భక్తులచే కిట కిట లాడుతున్నాయి. ఈ నెల 3న ప్రారంభబైన ఉత్సవాలు..12 విజయ దశమితో ముగుస్తాయి. కరీంనగర్‌లో శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఆయా మండపాలు, దేవాలయాలు భక్తులచే శోభిల్లుతున్నాయి. దుర్గా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూన్నారు. దాండియా ఆటా-పాటలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో రాత్రి వరకూ భక్తుల కోళాహలం నెలకొంటుంది.
వివిధ రూపాల్లో అమ్మవారు..
కరీంనగర్‌ లోని మహాశక్తి ఆలయంలో భక్త జన జాతర సాగుతోంది. దేవీ శరన్నవరాత్రోత్సవాలతో భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీ మహా దుర్గా, శ్రీ మహా లక్ష్మి, శ్రీ మహా సరస్వతి..అమ్మవార్లు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ, తన్మయత్వం పొందుతున్నారు. తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవీగా, శుక్రవారం గాయిత్రీ దేవీ ( డ్రైఫ్రూట్స్‌తో అలంకరణ), శనివారం అన్నపూర్ణాదేవి (శాకాంబరి), ఆదివారం లలితా దేవి (గాజులతో అలంకరణ) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం మహా చండీ దేవి (స్కంద మాత) రూపంలో, మంగళవారం కాత్యాయని ( శ్రీ మహాలక్ష్మి) దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను ప్రత్యేకంగా నాణేలు, తామర పువ్వులతో అలంకరించారు. ఏడొో రోజు సరస్వతి అమ్మవారిగా  భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు ఆయా రూపాల్లో దర్శనమిస్తున్న దుర్గా అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు.
విద్యుత్‌ కాంతుల్లో పరిసరాలు..
నగరంలోని మహాశక్తి ఆలయ పరిసరాలు, రహదారులు వివిధ దేవతా మూర్తుల ప్రతిమల విద్యుత్‌ కాంతులలో విరాజిల్లుతున్నాయి. ముఖ ద్వారాలు, ముఖ్య కూడళ్లలో విద్యుత్‌ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్ర వేళల్లో సాధారణ ప్రయాణీకులను సైతం భక్తి భావంలో ముంచెత్తేలా లైటింగ్స్‌ ఏర్పాటు చేశారు. నగరంలోని చైతన్యపురి కాలనీతో పాటు బాగ్యనగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రధాన వీధుల్లో లైటింగ్స్‌ ఆకర్శనీయంగా నిలుస్తున్నాయి.
ఉదయం, సాయంత్ర వేళల్లో సందడి..
మహాశక్తి దేవాలయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఉదయం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తిరిగి సాయంత్ర వేళల్లో వివిధ ఆధ్యాత్మిక, దాండియా, ఆటా`పాటా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక పూజలతో పాటు పారాయణాలు కొనసాగుతున్నాయి. పండితులచే సంకీర్తనలు, స్తోత్రాలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో దాండియా వేడుకల్లో ఎక్కువగా యువత పాల్గొంటుంది.
అమ్మవార్ల సన్నిదిలో కేంద్ర మంత్రి సంజయ్‌
ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా భవానీ దీక్ష తీసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌..నగరంలోని మహాశక్తి ఆలయంలోని అమ్మవార్ల సన్నిధిలో ఆధ్మాత్మిక వేడుకల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పూజలు, భవానీ స్వాములు, భక్తులతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకుంటున్న వీఐపీలు, ప్రజా ప్రతినిధులు
నగరంలోని అమ్మవారిని దర్శించుకుంటున్నారు పలువురు వీఐపీలు, ప్రజా ప్రతినిధులు. చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మహాశక్తి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నగర మేయర్‌ సునిల్‌ రావు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఇతర అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా పలువురు వీఐపీలు సైతం అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకున్న ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు కేంద్ర మంత్రి సంజయ్‌ని కలసి వేడుకలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page