- తుమ్మేటికి ప్రణవ్ ఝలక్
- ఆరుగురు అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు
- తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్
- ప్రణవ్ పై బహిరంగ విమర్శల ఫలితం
- వేగంగా మారిన పరిణామాలు
హుజురాబాద్, జనత న్యూస్:హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారాయి. అసమ్మతి నేతలు నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పై విమర్శలు చేయడం, పార్టీ వారిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో పాటు ఒకరికి షోకాజ్ నోటీసు ఇవ్వడం రెండు రోజుల్లో చకచకా జరిగిపోయాయి.
తుమ్మేటికి షాక్!
కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఝలక్ ఇచ్చారు. అధిష్టానం తుమ్మేటికి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు ఆరుగురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఏం జరిగింది?
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మేటి సమ్మి రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంటలో సమావేశమై నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ప్రణవ్ పై బహిరంగ విమర్శలు చేసారు. ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుండి పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని, తాము గతంలో బల్మూరి వెంకట్ కు టికెట్ వస్తే.. ఎంతో కష్టపడి పనిచేశామని, కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని, ప్రణవ్ ఒకరిద్దరి మాటలు వింటున్నారని, వారినే నమ్ముతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానంలో నిలిచిందని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగితే దానికి ప్రణవ్ బాధ్యత వహించాలని, అలాగే పార్టీ బాధ్యతలు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు అప్పగించాలని అసమ్మతి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు.
గట్టిగా స్పందించిన ప్రణవ్?
కాగా కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అలజడిని మొగ్గలోనే తుంచేయాలని, లేకుంటే ఇది రోజురోజుకు తీవ్రమవుతుందని, ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ప్రణవ్ పై బహిరంగ విమర్శలు చేసిన ఆరుగురు నేతలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. భవిష్యత్ లో ఇక అసమ్మతి స్వరం ఎవరూ వినిపించకుండా ప్రణవ్ జాగ్రత్తపడ్డారని తెలుస్తోంది. ఇకముందు నియోజకవర్గ ఇంఛార్జిగా తాను చెప్పినట్లు ఎవరైనా నడుచుకోవాల్సిందేనని, లక్ష్మణ రేఖ ఎవరూ దాటడానికి వీలులేదనే సంకేతాలు ప్రణవ్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.
కవ్వంపల్లి విడుదల చేసిన లేఖ లో ఏముందంటే..!
జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఒళ్ళాల శ్రీనివాస్, ఎండి. సలీం, ఎండి. ఇమ్రాన్, ఎండి సలీం పాషా, వాసాల రామస్వామి గార్లను పార్టీ నుండి బహిష్కరించడంతోపాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తుమ్మటి సమ్మి రెడ్డి గారికి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు అయన శనివారం సాయంత్రం లేఖ విడుదల చేసారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పై ఉద్దేశపూర్వకంగా విమర్శలు, కక్షపూరితంగా అసందర్భ ఆరోపణలు చేసారని, పార్టీ శ్రేణుల ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు, అంతర్గతంగా చర్చించుకోవలసిన పార్టీ విషయాలను బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేసినట్లు కవ్వంపల్లి ప్రకటించారు. ఇందులో కొందరు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలోకి వలస వెళ్లడం తిరిగి రావడం బిజెపి, బి.ఆర్.ఎస్ పార్టీలకు ఆ పార్టీలకు చెందిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అయోమయం కలిగే విధంగా ప్రవర్తించడాన్ని, కార్యక్రమాలు చేపట్టడాన్ని, వ్యవహరించడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు అయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వీరిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చెన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళమని, అయన ఆదేశానుసారం భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా వీరిని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు అయన తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీ తో గాని, కాంగ్రెస్ పార్టీకి వీరితో గాని ఎలాంటి సంబంధాలు లేవనే విషయాన్ని స్థానిక నాయకులు, మరియు మీడియా గుర్తించాలని అయన కోరారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తనకు తానే ప్రచారం చేసుకుంటున్న జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వ్యవహరించిన తీరును, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన షోకాజ్ నోటీసు జారీ చేశామని, ఈ నోటీసుకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కవ్వంపల్లి ఆదేశించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది చర్చనీయాంశమైంది.