Monday, January 26, 2026

Ts Parliament Elections 2024: ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కేనో?

Ts Parliament Elections 2024: ఖమ్మం (జనతా న్యూస్):లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం నుంచి పోటీ చేసే వారి పేర్లు ప్రకటించలేదు. వీటిలో ఖమ్మం సీటుపై ఉత్కంఠ నెలకొంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పది సీట్లకు 8 కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, సీపీఐ కొత్తగూడెంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచారు. ఇటీవలే ఆయన హస్తం గూటికి చెరారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి కారు గుర్తుపై ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలవనివ్వబోమని వార్నింగ్‌ ఇచ్చిన ఆ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తన పంతాన్ని ఇలా నెగ్గించుకున్నారు.2018 ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు ముద్ర పడింది. బీఆర్‌ఎస్‌తో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి పొసగక పోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌ గాంధీ సమక్షంలో కారు దిగి హస్తం గూటికి చేరారు. పొంగలేటితోపాటు తెల్లం కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌ నుంచి భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్‌ ఖరారు అవడంతో తిరిగి నెల రోజుల లోపే తెల్లం మళ్లీ కారెక్కారు.

బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి 2024 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచి కారు పార్టీ పరువు కాపాడారు. కాంగ్రెస్‌ అధికార పీఠం దక్కించుకోవడంతో, పొంగులేటి అనుచరుడిగా ముద్ర ఉండటంతో ఎప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఊహాగానాలు సాగాయి. దానికి అనుగుణంగానే. అప్పటి నుంచి తెల్లం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క,తుమ్మలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కుటుంబంతో కలిశారు. అయినా బీఆర్‌ఎస్‌ వీడేది లేదని చెబుతూనే, గులాబీ పార్టీ కార్యక్రమాలకు దూరం ఉన్నారు. మెడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ హజరైనా తెల్లం డుమ్మా కొట్టారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశాలకు హజరు కాలేదు. చివరకు తుక్కుగూడాలో జరిగిన కాంగ్రెస్‌ జన జాతర సమావేశంలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

2019 ఎన్నికల్లో ప్రస్తుత బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామానాగేశ్వరరావు ఇక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు మాత్రం బీఅర్‌ఎస్‌కు ఇక్కడ గెలవడం కష్టమే అని చెప్పాలి. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ ఖమ్మం శాసన సభ స్థానం నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ గెలుపొందారు. అయితే ఈసారి ఖమ్మం పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఏడు స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్‌ గెలవగా, కాంగ్రెస్‌ మిత్ర పక్షమైన సీపీఐ మరో స్థానంలో గెలిచింది. ఈ పరిస్థితుల్లో ఈ దఫా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు గెలుపు ఏదో అద్భుతం జరిగితే తప్ప అంత ఈజీ కాదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. గత శాసన సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం పరిధిలో వచ్చిన ఓట్లు చూస్తే.. బీఆర్‌ఎస్‌ కన్నా కాంగ్రెస్‌ 2.70 లక్షల మెజార్టీని గత శాసన సభ ఎన్నికల్లో సాధించింది. ఇది తప్పనిసరిగా గెలిచే సీటు కావడంతో జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తమ కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో వీరిలో ఒకరి కుటుంబ సభ్యుడికి టికెట్‌ ఇస్తే మిగతా ఇద్దరు ముఖ్య నేతలు సహకరిస్తారా లేదా అనే డౌట్‌ కాంగ్రెస్‌ అధినాయకత్వంలో ఉంది. వీరు ముగ్గురిని కాదని వేరే వ్యక్తికి ఇస్తే.. గత శాసన సభ ఎన్నికల్లో కలిసి పని చేసినంత తీవ్రతతో కాంగ్రెస్‌ గెలుపునకు ఈ ముగ్గురు సీనియర్లు పని చేస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది. ఖమ్మం టికెట్‌ ఆశిస్తున్న నేపధ్యంలో వీరి మధ్య విబేధాలు తమను గట్టెక్కిస్తాయా అన్న ఆశలో గులాబీ నేతలు ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని ఓడలు బండ్లవుతాయి..బండ్లు ఓడలవడం చూశామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖమ్మం పార్లమెంట్‌ సీటు ఎవరి ఖాతాలో పడుతుందో…. కాంగ్రెస్‌ నుండి ఎవరికి టికెట్‌ దక్కుతుందో… హస్తం నేతల మధ్య సఖ్యత ఉంటుందా.. ఎన్నికల్లో విభేదాలు గెలుపును తారుమారు చేస్తాయో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page