-
గులాబీ శ్రేణుల్లో గుబులు
-
కాంగ్రెస్ లో తగ్గని కలహాలు
-
బీజీపీ పై తగ్గుతున్న క్రేజ్..
(ఎస్.వీ. రమణాచారి, సీనియర్ జర్నలిస్ట్)
తెలంగాణ లో ఎన్నికల యుద్ధం హోరా హోరీగా కొనసాగుతోంది. ఏ నియోజక వర్గం చూసినా గ్రామ,గ్రామన డప్పుల హోరుతో వివిధ పార్టీల నినాదాలు మిన్నంటుతున్నాయి. ఏ పార్టీ ఊగింపు చూసినా జనం నిండుగా కనపడుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి అస్త్ర శస్త్రాలతో సంసిద్దంగా ఉంది.అయితే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం కోసం మల్లగుల్లాలు పడాల్సి వస్తున్నదని విశ్లేషకుల అభిప్రాయం.రాష్ట్రంలోని అనేక నియోజక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పలువురు స్పష్టం చేస్తున్నారు.రెండో శ్రేణి నాయకత్వం సహా స్థానిక నాయకుల తప్పిదాలతో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తాకే అవకాశాలు కనపడుతున్నాయి.ట్రబుల్ షూటర్ హరీష్ రావు తన చాణుక్యతను ఉపయోగించి అందరినీ సమన్వయం చేసే పనిలో ఉన్నారు.ఉద్యమ సమయం నుంచి కింది స్థాయి కార్యకర్తలతోనూ,నాయకులతోను రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధాలు ఉన్నాయి.ప్రతీ కార్యకర్తను కలసి సమన్వయం చేయటం ఆయనకు తలకు మించిన భారంగా మారి పోతుంది.బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా పార్టీ విజయం కోసం శ్రమపడాల్సి వస్తూంది. అంతా కేసీఆర్ చరిష్మానే నమ్ముకుంటున్నారు.

అటు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే రోజు రోజుకు బలం పుంజు కుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పటి లాగానే కీచులాటల సమస్యలతో ఆ పార్టీ నేతలు సతమతం అవుతున్నారు.కొన్ని నియోజకవర్గాలలో బలమయిన అభ్యర్థులు గా ఉన్నవారికి, సీనియర్ నేతలకు టికెట్ రాకపోవటంతో వారంతా బీఆర్ఎస్, బీజీపీ కి మద్దతు ఇస్తున్నారు.ఈ వార్త రాసే సమయానికి బీ ఫామ్ పొందిన వారిజాబితా ఇంకా స్పష్టం కాలేదు.కర్ణాటక రాష్ట్రంలో సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మంచి ఊపుతోనే ఉంది.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలు కూడా ప్రత్యేక దృష్టి సారించటంతో కొంత మేరకు ప్రజలకు దగ్గర అవుతుంది.రూ.500 లకే సిలెండర్ ఇది కాంగ్రెస్ నినాదం. దీనిని బీఆర్ఎస్ కూడా ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంతవరకు నమ్మకం ఉన్న ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో ప్రజల్లో విశ్వాసనీ యతను చూరగొనడం లేదన్నది వాస్తవం. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ భుజాన వేసుకున్నట్లు కనబడడం లేదు.బీ ఫార్మ్ ల పై స్పష్టత వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు మరింత గట్టిగా కృషి చేసే అవకాశాలు ఉన్నాయి.

మరో వైపు బీజీపీ పరిస్థితి జీహెచ్ఎమ్ సి, మునుగోడు,దుబ్బాక ఎన్నికల సమయంలో మంచి ఊపుగా కనిపించింది.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి గా ఉన్న బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించిన తరువాత ఆ పార్టీ క్రేజ్ దినదినం దిగజారు తుందని కార్యకర్తలు మదన పడుతున్నారు. పార్టీలో కూడా కీచులాటలు తార స్థాయికి ముదిరినట్లు మీడియా లో కొన్ని కధనాలు కూడా వచ్చాయి.తాజాగా బీసీని సీఎం గా నియమిస్తా మంటూ ఆ పార్టీ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. తమ పార్టీ లో ఎవరిని సీఎం గా చేస్తారోనానని తెలియక ఆ పార్టీ కార్యకర్త లు అయోమయంలో పదుతున్నారు.మొదటినుంచి గ్రూపులకు,వ్యక్తుల ఆకర్షణకు దూరంగా ఉండి పార్టీ సిద్ధాంత లకు కట్టుబడిన వారికే పార్టీలో పదవులు వరించాయి.ప్రస్తుతం పార్టీ లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం తో బీజీపీ నే నమ్ముకున్న వారు కొంత నిరుత్సాహానికి గురికావడం తో ఆ పార్టీ పరిస్థితి రానున్న కాలంలో ఎలా ఉంటుందోనని బీజేపీ అభిమానులు ఆందోళన చెందు తున్నారు. తొలుత బిజెపి యువతను ఆకర్షించే ప్రయత్నాలు జరిపినప్పటికీ ఎన్నికల సమయం నాటికి ఊపు కనిపించడం లేదు.
రాష్ట్రంలో వామపక్షాలు సహా మిగతా పార్టీల సంగతి అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా ఎన్నికలకు 3 వారాలు ఉన్నా ఏ పార్టీ స్పష్టత మెజారిటీ వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. రెండేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మరోసారి అధికారం ఇస్తే హ్యాట్రిక్ కొట్టిన పార్టీగా రికార్డులోకెక్కుతుంది. లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలను ఆదరించినట్లే. ఒకవేళ బీజేపీ ఫాంలోకి వస్తే.. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఆదరించారని అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు మాత్రం తమ ప్రభుత్వమే వస్తుందని ప్రచారం చేస్తున్నారు.