- రెండు టిప్పర్ల మట్టి ఖాళీ
- మరో రెండింటికి నామమాత్రపు ఫైన్
- గతంలో ‘జనత’లో మట్టి దందాపై కథనం
మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్: సిద్దిపేట జిల్లాలో సాగుతున్న మట్టి దందాపై అధికారులు ఫోకస్ చేశారు. తాజాగా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టికున్నారు. వీటిలో రెండింటి మట్టిని తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ చేయించారు. మరో రెండింటికి మాత్రం నామమాత్రపు ఫైన్ వేశారు. అయితే గతంలో ‘మానేరు జనత’లో మట్టి దందాపై కథనం వచ్చింది. దీనిపై అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట స్టేజి సమీపానికి చిన్న కోడూరు మండలంలోని మల్లారం గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్ లను బెజ్జంకి మండల తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ పట్టుకున్నారు. ఒక్కొక్కదానికి 3000 రూపాయల జరిమానా విధించారు. గత నెల 26వ తేదీన ‘మానేరు జనతా’ లో ‘ఎన్నాళ్ళు ఈ మట్టి దందా.. పట్టించుకునే నాథుడే లేడా’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ వార్త వచ్చిన మరుసటి రోజు నుంచి మట్టి తరలింపు ఆగిపోయింది. అయితే రెండు రోజుల నుంచి మళ్లీ రాత్రనక, పగలనక మట్టి తరలింపు సాగుతూనే ఉంది.
అయితే శుక్రవారం సాయంత్రం బెజ్జంకి తహసీల్దార్ మట్టితో ఉన్న నాలుగు టిప్పర్లను ముత్తన్నపేట శివారులో పట్టుకుని హుటాహుటిన వాటిని బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. గంట వ్యవధిలోని రెండు టిప్పర్ల మట్టిని తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ చేయించారు. ఇంకో రెండు టిప్పర్లు మట్టితో ఉన్న వాటిని వెనక్కి పంపారు. మట్టితో ఉన్న వాహనాలను వెనక్కి పంపడంపై మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి జోక్యం ఉందని అనుకుంటున్నారు. వీటికి నామమాత్రంగా ఫైన్ వేసి తిరిగి అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అధికారి లేరు. ఫోన్ లో సంప్రదిస్తే అందుబాటులోకి రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా సదరు ప్రజాప్రతినిధి కనున్నల్లోనే జరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి తరలింపుపై దృష్టి పెట్టాలని మండలవాసులు కోరుతున్నారు.