ఒకే పార్టీ… ఒకే సిద్ధాంతం…
కరీంనగర్ గుండెల్లో నిలిచిపోయేలా పనిచేస్తా
కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం
కరీంనగర్-జనత న్యూస్
‘‘ వందేళ్లు బతకాలని కోరుకోవడం లేదు..బతికిన్నాళ్లు ధైర్యంగా ఉంటా, నిజాయితీగా పోరాడుతా. ప్రజల మనస్సుల్లో నిలిచి పోయేలా పనిచేస్తా! కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తా. కేంద్ర మంత్రిగా ఏదో ఒకటి సాధించి తీరుతా !’’ అంటూ భావోధ్వేగంతో మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ కాపువాడ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంతోషంతో పులకించి పోయారు. కాపువాడలో పుట్టిన బిడ్డ నని, ‘నేను మిమ్మల్ని మరిస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లే ’ నని వ్యాఖ్యానించారు .ఇక్కడికి కేంద్ర మంత్రిగా తాను రాలేదని..తన ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. కాపువాడ రాజకీయ జీవితాన్నిచ్చిందని, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా తొలిసారి ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచానని గుర్తు చేశారు. గుండెపోటు వల్ల తాను చనిపోతానని డాక్టర్లు చెప్పారని..మహాశక్తి అమ్మవారు తనను బతికించిందని చెప్పారు బండి సంజయ్. కాపువాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ధర్మం కోసం పనిచేసేవాడినని, ప్రజల కోసం ఎంతదాకైనా పోరాడుతానని తెలిపారు. తనను క్రిమినల్‌గా మార్చాలని గత ప్రభుత్వం చూస్తే..ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా నన్ను హోం శాఖ సహాయ మంత్రిని చేశారని కొనియాడారు.