భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి
రోడ్ల విస్తరణతో భూములకు మంచి ధరలు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం-జనత న్యూస్
నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే విపత్తులు తప్పవని, అందుకే నీటి వనరులను తమ ప్రభుత్వం పరిరక్షించే చర్యలు చేపట్టిందన్నారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత`జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీరాంనగర్ రోడ్ నెం. 13లో రూ. 50 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చేపట్టిన పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రోడ్డు నిర్మాణం, విస్తరణల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, దీంతో భూములకు మంచి ధరలు వస్తాయని అన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలని, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. నాలాలను, రోడ్లను ఆక్రమించడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని పలు ఉదాహారణలను వివరించారు. వెలుగుమట్ల పార్క్ అభివృద్ధి చేస్తామని, ఆక్రమణలు తొలగించాల్సిన పరిస్థితులలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యం వ్యాపార రంగాల్లో ఖమ్మంను ఆదర్శంగా తీర్చి దిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సిహెచ్ స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే విపత్తులు తప్పవు

- Advertisment -