-
తిలా పాపం తలా పిడికెడు…
-
కంచే చేను మేస్తున్నట్టుగా అధికారుల తీరు?
-
అడ్డూఅదుపులేని ఇసుక దందా
(యాంసాని శివకుమార్ -జనత న్యూస్ ప్రతినిధి)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. మండలంలోని మోయతుమ్మెద వాగు ఇసుకాసురులకు కామధేనువుగా మారింది. ఎవ్వరూ ఊహించని రీతిలో భారీగా జరుగుతున్న దందాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులకు పెద్దఎత్తున అమ్యామ్యాలు ముట్టుతుండడంతో ఏ ఒక్కరు నోరుమెదపడం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా అక్రమార్కులు, అధికారులు కలిసి అందినకాడికి వనరులను దోచుకుతింటున్నారు. ముఖ్యంగా ఇలాంటి అక్రమ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్జనకు ఆశపడి దందాకు దారి వదులుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కంచే చేను మేసిన చందంగా అన్నిశాఖల అధికారులు పూర్తిగా అండగా ఉండడంతో ఇక అడ్డూ అదుపు లేకుండా అక్రమ వ్యవహారం మూడు లోడ్లు ఆరు ట్రిప్పులుగా వర్ధిల్లుతోంది.
For E Paper Click Here..
https://epaper.janathadaily.in/view/335/23-04-2024

బెజ్జంకి మండలంలోని మోయతుమ్మెద వాగు పరివాహక గ్రామాల్లో ఇసుక మాఫియా వేళ్లూనుకుపోయింది. గూడెం, తోటపల్లి, గాగిలాపూర్ గ్రామాల పరిధిలో పెద్దఎత్తున ఇసుక డంప్‌లను ఏర్పాటుచేసి లారీల ద్వారా దర్జాగా తరలిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం సాదాసీదాగా జరుగుతుందనుకుంటే పొరపడినట్టే. ఇందులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులతో పాటు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుపడి దోచేస్తున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ సాధారణ పౌరులకు రెవెన్యూ కార్యాలయంలో ఏ పనీ జరగనప్పటికీ ఇసుకకు సంబంధించిన పర్మిషన్లు మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా జరుగుతున్నట్టు జనం ఆరోపిస్తున్నారు. ఇసుక పర్మిషన్లపై ఎవరైనా ప్రశ్నిస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇండ్ల నిర్మాణాల కోసం పర్మిషన్లు ఇస్తున్నట్టు పేర్కొంటుండడం గమనార్హం. ఎవరైనా సాధారణ వ్యక్తులు ఇండ్లు కట్టుకుంటున్నామని బతిలాడితే అలాంటి వారికి మాత్రమే ఇసుక రవాణాకు అనుమతిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నప్పటికీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని తెలుస్తోంది. ఇండ్లు కట్టుకునేవారు మొదట పర్మిషన్ తీసుకుని ఆ లెటర్‌ను రెవెన్యూ అధికారులకు చూపిస్తేనే ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 200 ఇండ్ల వరకు పర్మిషన్ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ నిజానికి అన్ని ఇండ్ల నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ జరిగినా అంతమంది ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఇసుక కోసం దరఖాస్తు చేసుకుని ఇండ్లు కట్టుకుంటున్నారా? అలాగే ఎవరైతే పర్మిషన్ తీసుకుని ఇండ్లు కట్టుకుంటున్నారో అక్కడ ఇసుక కుప్పలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం మాత్రం లభించడం లేదు. వాస్తవమేమిటంటే పర్మిషన్ తీసుకున్న ఇండ్లకు ఇసుక సరఫరా పేరుతో అధికారులే విచ్చలవిడిగా ఇసుకమాఫియాకు సహకరిస్తూ వారికి రాచమార్గం సృష్టిస్తున్నట్టు స్పష్టంగా అవగతమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదు చేసినా, ప్రశ్నించినా దాడులే…
ఇసుక అక్రమ రవాణాపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనుకాడడం లేదు. ఇక కొందరు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదు దారులకే బెదిరింపులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దందాలో అధికారుల హస్తం ఉండడం వల్ల ఫిర్యాదు దారులు తెలియక అదే అధికారులకు ఫోన్ చేసినా ఫలితం శూన్యంగా ఉంటుంది.
వివిధ శాఖలకు అందుతున్న మామూళ్లు…
ముఖ్యంగా ఇసుక అక్రమ వ్యవహారాన్ని నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్, విజెలెన్స్, స్పెషల్ బ్రాంచి ఇలా పలు శాఖలు నిత్యం నిఘా ఉంచాల్సి ఉంటుంది. అయితే ఈ శాఖలన్నింటి నే కలెక్టర్, పోలీస్ బాసులు సైతం నమ్ముకుంటాయి . ఒక లారీ ఇసుక ట్రిప్పుకు రూ.5వేలు మామూళ్లు ముడుతున్నాయని ఇవి ఎవరికి అందుతున్నాయో అంతుచిక్కని ప్రశ్నా? ఇలా రోజుకు వేలాది టన్నుల ఇసుక రవాణా జరుగుతుంటే నిత్యం లక్షల్లో చేతులు మారుతున్నట్టు తెలుస్తుంది.
ఇల్లీగల్ దందా దర్జాగా లీగల్?
డంప్ చేసిన ఇసుక కుప్పలకు రెవెన్యూ అధికారి యాక్షన్ చేయాలంటే పేపర్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన వారికి కేటాయించాల్సి ఉంటుంది. అది కూడా స్థానిక అవసరాలకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా ఎవరైతే ఇసుక కుప్పలను అక్కడ డంప్ చేశారో వారికే ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారి ఇసుకను అప్పగిచ్చడంలో ఆంతర్యం ఏమిటీ? సుమారు 200 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేస్తే అది కూడా అక్రమార్కులకు వరంగానే మారుతుంది. ఎందుకంటే సీజ్చేసిన ఎమ్మార్వో ఎలాంటి యాక్షన్ లేకుండా అక్రమార్కులకే కట్టబెడితే ఈ ఇసుక కుప్పలను అక్కడి నుంచి తరలించడానికి సుమారు మూడు నుండి నాలుగు రోజుల గడువు ఇస్తారు.. ఇదే అదనుగా అక్రమార్కులు రాత్రికి రాత్రే 200 ట్రిప్పుల ఇసుకను హైదరాబాద్‌కు తరలించి అదే రాత్రి తెల్లారే సరికి మరో 200 ట్రిప్పులను వాగు నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఖాళీ అయిన ప్రాంతంలోనే డంప్ చేస్తారు. ఇలా ఈ నాలుగు రోజుల్లోనే సుమారు 1200 ట్రిప్పుల వరకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ పెద్దఎత్తున జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే పరోక్షంగా ఈ వ్యవహారాన్ని అధికారులే లీగల్‌గా ముందుండి అక్రమార్కులకు కూడా మేలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ భయంకరమైన మాఫియా గురించి కిందిస్థాయి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాలకు తెలిసినప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఇటీవల తోటపల్లి ప్రాంతంలో పెద్దఎత్తున ఇసుక డంప్ చేసినట్టు ఫిర్యాదు రావడంతో అధికారులు సీజ్ చేశారు. అయితే అక్కడ వంద ట్రిప్పుల ఇసుక ఉన్నప్పటికీ కేవలం 15 లోడ్ల ఇసుకను మాత్రమే మీడియాకు చూపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ప్రాజెక్టుల కోసం తోటపల్లి చెరువు నుంచి పెద్దఎత్తున ఇసుకను తరలించి అక్రమాలకు ఒడిగట్టడంతో ప్రజలు ధర్నాలు చేయడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రాజెక్టులకు సగం, హైదరాబాద్‌కు సగం తరలించి అక్రమంగా సొమ్ముచేసుకున్నారనే విమర్శలు వచ్చాయి.
కలెక్టర్, సీపీలకు వరకు వెళ్లని అక్రమ వ్యవహారం!
బెజ్జంకి మండలంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై కలెక్టర్, సీపీల వరకు ఫిర్యాదులు వెళ్లకుండా కిందిస్థాయి అధికారులు వారిని తప్పుతోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇసుక మాఫియా దందాలను పసిగట్టేందుకు కలెక్టర్‌కు గానీ, సీపీకి గానీ ప్రత్యేక నిఘా వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అయితే ఈ నిఘా వ్యవస్థలకు సంబంధించిన అధికారులు నిత్యం అక్రమ వ్యవహారాలపై కలెక్టర్, సీపీకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ దందాపై వారు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల కలెక్టర్, సీపీల వరకు వెళ్లకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ మాఫియాగా అవతరించి ఇసుకను దోచేస్తుంటే… వీరి పాపం పండేదెప్పుడని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, సీపీలు స్వయంగా ఇసుక దందాపై దృష్టిసారించి ముగింపు పలకాలని కోరుతున్నారు.