- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
- వేములవాడలో పట్టణ బూత్ స్థాయివారియర్స్ సమావేశం
వేములవాడ, జనతా న్యూస్: బీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ పట్టణ పోలింగ్ బూత్ స్థాయి బీ ఆర్ ఎస్ పార్టీ కమిటీ ఇన్ చార్జీల వారియర్స్ తో మంగళవారం వినోద్ కుమార్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సమయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అమలు చేయాల్సిన విధివిధానాలు, గురుతర బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి? అన్న అంశాలను వినోద్ కుమార్ వివరించి చెప్పారు. అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు సవివరంగా వివరించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు మరోసారి గుర్తుచేయాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాగిన ఉద్యమ, ప్రభుత్వ పాలన, సాధించిన విజయాలు, ఇంకా సాధించాల్సి ఉన్న అంశాలను వినోద్ కుమార్ సుదీర్ఘంగా వివరించారు. పోలింగ్ బూత్ లలో వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని, ఆయా పోలింగ్ బూత్ ల పరిధిలో ఉన్న ఓటర్స్ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేల ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రాజు, పోలింగ్ బూత్ ఇంచార్జీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.