Sunday, July 6, 2025

తెలంగాణలో తెల్లకార్డే వజ్రాయుధం

(యాంసాని శివకుమార్-ఎడిటర్)
ఆ ఆరు గ్యారెంటీల హామీ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టింది. ఆ ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది.  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఢంకా భజాయించింది.  ఆ ఆరు గ్యారెంటీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆ ఆరు గ్యారెంటీలు ఇవే..

1. మహాలక్ష్మి
ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
రూ.500లకే గ్యాస్ సిలిండర్
రాష్ట్రమంతటా మహి‌‍ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
2. రైతు భరోసా
ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
3. గృహజ్యోతి
ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం
4. ఇందిరమ్మ ఇళ్లు
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
5. యువ వికాసం
విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవల‌ప్‌మెంట్‌ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం.
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
6. చేయూత
పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం
ఎనుముల రేవంత్‌రెడ్డి సారధ్యంలో అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ, ఆ ఆరు హామీల్లో ఒకదాన్ని అమలు చేసింది.  ఆ ఒక్కటి ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.  ఇందుకు మహిళల వయసుతో సంబంధం లేకుండా ఆధార్‌కార్డు ఆధారంగా కేవలం తెలంగాణ మహిళలకు జీరో క్యాష్‌ టికెట్‌ ఇచ్చి, ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. మరో 80 రోజుల్లో ఆ ఆరు హామీల్లో మిగిలిన వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందా ? అనేది అనుమానాస్పదంగా మారింది.  ఆ ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఒక్కటే సమస్య అనుకుంటే పొరపాటే.  ఆ ఆరు హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాలేదు. విధివిధానాలపై కసరత్తు చేసి, ప్రజలకు పూర్తి భరోసాతో స్పష్టత ఇవ్వాల్సిందిపోయి,  ఒక్కో మంత్రి ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చి, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ హామీల అమలుకు తెల్లకార్డే కీలకం కానుందా ? 
ఆరు గ్యారెంటీల అమలుకు తెల్లకార్డే కీలకం కానుందా ? అంటే అవుననే సమాధానం వస్తుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి, ఎందుకంటే నిరుపేదలకు తాను సేవకుడినంటూ పదే పదే చెప్పుకొచ్చిన రేవంత్‌రెడ్డి, అదే మాటకు కట్టుబడి నడుస్తున్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న వారినే నిరుపేదలుగా గుర్తించి తెల్లకార్డులు ఇచ్చిన గత ప్రభుత్వాలు, అదే బాటలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కూడా తెల్ల కార్డుదారులకే అగ్రతాంబులం ఇవ్వనుంది.  తెలంగాణలో అన్ని పథకాలకు తెల్లకార్డే ప్రామాణికం కాబోతోంది. మరి తెల్ల రేషన్‌కార్డు లేనివారి పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఈ నెల 28 నుంచి  వచ్చే నెల 6 వరకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.  అన్ని పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పథకాలకు అర్హత ఉండి రేషన్‌కార్డు లేనివారి సంగతి ఏంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతానికిపైగా మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉన్నదని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం పేర్కొంది. తెల్ల రేషన్‌ కార్డుదారుల్లో బియ్యం తీసుకుంటున్నవారి సంఖ్య 80 శాతం మాత్రమే ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  చెప్పారు.  పెండింగ్‌లో ఉన్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి, కొత్త తెల్లరేషన్‌ కార్డులు మంజూరు చేస్తారని కొందరు చెప్తుండగా, మరికొందరు కొత్తగా దరఖాస్తు ప్రక్రియ చేపడతారంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే దరఖాస్తులను ఎప్పటిలోగా పరిశీలించి, కొత్త తెల్లరేషన్‌ కార్డులు ఇస్తారనే దానిపైనా స్పష్టత కరువైంది. కొత్తగా రేషన్‌కార్డు ఇచ్చిన తర్వాతే ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా ?  ఈలోపు ఆ వంద రోజులు గడిచిపోతే, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్ముతారా ?  ఆ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ భవిష్యత్తు ఆ ఆరు గ్యారెంటీల అమలుపైనే ఉందా ? అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
నిధుల సమస్యతో గానీ, విధివిధానాల రూపకల్పనలో జాప్యం, కాంగ్రెస్‌ ప్రభుత్వం, అధికారుల సమన్వయంలో లోపం ఇలా కారణమేదైనా ఆ ఆరు గ్యారంటీలు అమలు కాకపోతే, ఆ ప్రభావం ఖచ్చితంగా రాబోయే లోక్‌ సభ ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు హామీల అమలులో విఫలమైతే,  దాన్నే బూచిగా చూపి, తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనే ఉత్సుకతలో ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీ పార్టీలు రెడీగా ఉన్నాయి. తెలంగాణలో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. ఆ ఆరు హామీల అమలుకు నిధుల్లేవు, వెనక్కి తగ్గితే కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయే ప్రమాదం, ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంయమనంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.  ప్రజాపాలన ఎలా సాగిస్తుందనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page