- తెలంగాణపై కాషాయ ముద్రకు యత్నాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా పంపాల్సిందిగా బీజేపీ అగ్రనేతల నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు అందినట్లు సమాచారం.
మరోవైపు మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని బీజేపీ కలలు కంటోంది. బలమైన విపక్షం లేకపోవడంతో భారతీయ జనతా పార్టీకి అది ప్లస్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా కూటమికి బీటలు రావడం, కమలం పార్టీకి బాగా కలిసొచ్చే అవకాశంగా మారింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత బీహార్ లో జరిగిన పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ క్రమంలో బీజేపీ నార్త్ లో బలంగా ఉన్నా.. సౌత్ లోనూ సత్తా చాటేందుకు సమాయాత్తమవుతోంది.
ఈ నేపధ్యంలో త్వరలో తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. లేదంటే కింగ్ మేకర్ గా మారతామని కమలం పార్టీ ఆశపడింది. కాకపోతే రిజల్ట్స్ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తమ స్టామినా ఏంటో చూపిస్తామని శపథం చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ప్రజలను వేర్వేరుగా చూస్తారని చెబుతున్నారు. మోదీ మేనియాను క్యాష్ చేసుకుంటామంటున్నారు. అందుకే అందరికంటే ముందే తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం, దీనిని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపినట్లు సమాచారం. మెజార్టీ స్థానాలను వచ్చే వారం అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. తొలి జాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, అయోధ్య రామమందిరం నిర్మాణ కావొచ్చు, జ్ఞానవాపిలో హిందు దేవతలకు పూజలు చేయడం కొవొచ్చు.. అంశం ఏదైనా కావచ్చు. బీజేపీ బలంగా ఉందని సంకేతాలు మాత్రం జనాల్లోకి వెళుతున్నాయి. ఈ తరుణంలోనే దేశంలో మాత్రం ఎన్నికల మూడ్ వచ్చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. షెడ్యూల్ కంటే 20రోజుల ముందే క్యాండిడేట్స్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. అందులో ఎంతమందిని అదృష్టం వరిస్తుందో అన్నది చూడాలి.