శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిషలు కృషి
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం
సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
సిద్దిపేట-జనత న్యూస్
ఉత్తర`దక్షణ భారత్‌కు మధ్య అనుసంధానంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఓ మినీ ఇండియా అని అభివర్ణించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ గొప్ప చారిత్రాత్మక వారసత్వమని, 1948 సెప్టెంబర్ 17 భారత్‌లో విలీనమై తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు అని గుర్తు చేశారు. అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర, అఖండమైన వారసత్వం ఉందన్నారు. దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని, తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలోనే పడ్డాయని గుర్తు చేశారు. ప్రథమ ప్రధాని నెహ్రు చెప్పినట్లు బిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత అని.. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం ఇతర మతాల, సంస్కృతుల సంగమ స్థలం మనదేశమని, దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలో హిందూ, ముస్లిం సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంత గానో విరాజిల్లుతుందన్నారు. మహాత్మా గాంధి అంతటి మహనీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా` జమున తెహజీబ్’’ అని ప్రశంసించారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తులను నిర్మూలిస్తూ పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న అధికారుల సేవలను ఆయన కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ స్పూర్తితో నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుబడే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కమీషనర్ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.