-
అభ్యర్థుల ప్రకటనపై మరింత ఆలస్యం
-
అడ్డు వస్తున్న సామాజిక సమీకరణాలు
-
లిస్ట్ ఫైనల్ అయినా వెల్లడించేందుకు వెనుకంజ
-
గాంధీ భవన్ వేదికగా మరోమారు కసరత్తు
-
కరీంనగర్‌లో ఎప్పటికప్పుడు మారుతున్న ఈక్వేషన్స్
(జనతాప్రతినిధి, కరీంనగర్)
దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల టాస్క్‌ను ఎదుర్కోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెలుపొందాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఇంతవరకు అభ్యర్థులను మాత్రం ఫైనల్ చేయలేకపోయింది. రేపు ఎల్లుండి అంటూ ప్రచారం వినిపిస్తున్నా క్యాండిడేట్ల ప్రకటన అంతా ఈజీగా లేదని తెలుస్తోంది. ఇందుకు సామాజిక సమీకరణాలు అడ్డుగా వస్తున్నట్లు సమాచారం. రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు మినహా మిగితా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఆలోచనలో అధిష్టానం..
రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో.. 3 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. మరో రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ ఉన్నాయి. ఇంకొకటి మజ్లిస్ కోటాలో ఉంది. ఇంకో మూడు బీసీలకు కేటాయిస్తూ వస్తున్నారు. ఇవన్నీ పోను రాష్ట్రంలో 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు మాత్రమే ఎలాంటి రిజర్వేషన్ లేదు. దాంతో ఈ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిలా తయారైంది. అయితే.. ఈ 8 నియోజకవర్గాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఫైనల్ అయినట్లుగా తెలిసింది. గత చరిత్రను పరిశీలిస్తే ఏ పార్టీ అయినా సరే ఇప్పటివరకు గరిష్టంగా ఆరు సీట్ల వరకు మాత్రమే కేటాయించారు. కానీ.. ఈసారి 8 సీట్లు ఇస్తే పార్టీకి నష్టం చేకూర్చవచ్చనే అభిప్రాయం అధిష్టానంలో మొదలైంది. అందుకే.. దీనిపై గాంధీభవన్ వేదికగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జనరల్ స్థానాలన్నింటినీ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని తలలు పట్టుకుంటున్నారు. అందుకే.. అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ స్థానంపైనే ఉత్కంఠ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మూడు పార్లమెంట్ నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. అందులో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇక కరీంనగర్ స్థానానికి వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్ రావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8 స్థానాలకు 8 మందిని రెడ్డిలను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలా కాకుండా ఒకటి రెండు సీట్లను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాంతో కరీంనగర్ స్థానాన్ని ప్రవీణ్ రెడ్డి కోసం ఫైనల్ చేసినా ముఖ్యనేతలు ఆలోచనలో పడినట్లు సమాచారం. అందులో భాగంగా ప్రత్యామ్నాయంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కరీంనగర్ టికెట్ కోసం వెలిచాల కూడా పట్టుబడుతున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోకవర్గం వెలమలకు కంచుకోట. ఈ స్థానం నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలే ఎక్కువగా ఉన్నారు. వెలమ ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది. అటు వెలిచాల ఫ్యామిలీని పరిగణలోకి తీసుకొని.. గత అనుభవాల దృష్ట్యా ఆయనకే టికెట్ కేటాయిస్తే గెలుపు సులువు అవుతుందేమోనని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ దాదాపు 30వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మిగితా ఓటు బ్యాంకు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంది. దాంతో తనకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారు. నిజామాబాద్ స్థానం తప్ప వేరే ఎక్కడ ఇచ్చినా తాను పోటీలో ఉండబోనంటూ ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటు నిజామాబాద్ టికెట్ కోసం సినీ నిర్మాత దిల్ రాజు పట్టుబడుతున్నారు. ఇక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పోటీపడుతున్నారు. కాగా.. అక్కడ ఇప్పటివరకు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్నారు. ఇక.. పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి గడ్డం వంశీకృష్ణ పేరు ఫైనల్ అయినట్లు వినిపిస్తున్నా.. తాజాగా సుగుణకుమారి భర్త రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ఆడియో వైరల్ అయింది. ఇప్పటివరకు గడ్డం వంశీ పేరు కానీ.. నేతకాని వెంకటేశ్ పేరు కానీ ఫైనల్ కాలేదని వరుసలో సుగుణకుమారి ఉన్నారని స్పష్టం చేశారు. దాంతో ఆ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ నెలకొంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన పెద్దపల్లి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి తప్పడం లేదు.
అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం..
ఓ వైపు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కొన్ని స్థానాలు మినహా మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఆ పార్టీల నేతల్లో ఉత్కంఠ పోయి ప్రశాంతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోతోంది. మంగళవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. ఆ సమావేశం ముగిసిన తరువాత అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అర్ధరాత్రి వరకు కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కనీసం బుధవారం అయినా ఆ ప్రకటన వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయినా.. ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే లిస్ట్ ఫైనల్ అయిందని సమాచారం అందుతున్నా పార్టీకి డ్యామేజీ జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ కన్ఫ్యూజన్‌తోనే అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన మరో ఒకట్రెండు రోజులైనా పట్టొచ్చని సమాచారం.