Tuesday, July 1, 2025

ఆదరించారు.. అండగా ఉంటా.. : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

  • ప్రతీ మండలానికి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తా.. ఇది నా వ్యక్తిగత హామీ..
  • యువతా.. ఉద్యోగాలకు సిద్ధం కండి..ఎలాంటి లీకులు ఉండవు
  • అల్గునూరులో ఆసుపత్రి నిర్మాణం..
  • మూడెకరాలు, దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ మోసం
  • రసమయిని నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం..
  • కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవుల ఇస్తామని చెప్పలేదు..
  • మంత్రి పదవి రావాలని కోరుకుంటున్న మాట వాస్తవమే..
  • తడిసిన ధాన్యం సమస్య పరిష్కారానికి డ్రయ్యర్లు కొంటాం..
  • మానకొండూర్ లో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..
  • జిల్లాల కుదింపులో ఆ రెండు మండలాలు కలుస్తాయి.
  • ‘జనత’ ఇంటర్వ్యూలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యలు..

(యాంసాని శివకుమార్-జనత ప్రతినిధి)

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ వైద్య వృత్తిలో కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులయ్యారు. గతంలో ఎంతో మందికి వైద్య సేవలు అందించిన ఆయన ప్రజల్లో విశేషంగా గుర్తింపు పొందారు. అయితే నేరుగా ప్రజల బాగోగులు చూసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున మొదటిసారి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.2014 టీడీపీ నుంచి పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కవ్వంపల్లికి ఆ పార్టీ జిల్లా బాధ్యతలు చూసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయనకు కార్యకర్తల నుంచి మద్దతు పెరిగింది. ఈ క్రమంలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం కవ్వంపల్లి మానకొండూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరుపు వారికి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘జనత న్యూస్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే..

‘జనత’ ప్రతినిధి: వైద్య వృత్తిలో ఉన్న మీరు రాజకీయాలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?
‘కవ్వంపల్లి’: 25 సంవత్సరాల పాటు వైద్య వృత్తిలో కొనసాగిన. ఉస్మానియా ద్వారా వైద్యసేవలు అందిస్తున్న క్రమంలో ఒక ముఖ్యమంత్రిని కలిశాను. ఈ సందర్భంగా ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రాకూడదు? అని అన్నారు. ఆ సమయంలో ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా. అప్పటికీ మానకొండూర్ నియోజకవర్గం రిజర్వ్ డు అయింది. దీంతో నా నియోజకవర్గంలో ప్రజలకు సేవ దొరికే అవకాశం వచ్చినందున నేరుగా రాజకీయా్లోకి వచ్చా.

 

kavvmpally satyanarayana interviews
kavvmpally satyanarayana interviews

 

‘జనత’ ప్రతినిధి: అసెంబ్లీలో మీ ఆధ్వర్యంలో మూడు స్థానాలు గెలిచారు. ఇప్పడు ఎంపీ ఎన్నికలలో మీ ప్రభావం ఉండనుందా?
‘కవ్వంపల్లి’: కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నా హయాంలో మూడు స్తానాలు గెలవడం నాకు సంతృప్తినిచ్చినిచ్చింది. ఇదంతా ప్రజల ఆదరణతోనే. 5 సీట్లు కూడా లేని కాంగ్రెస్ ఇప్పుడు నేడు అధికారంలోకి రావడం మరింత సంతోషకరమైన విషయం. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన ఆరు గ్యారెంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీంతో వారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మోడదీపై వ్యతిరేకత ఉంది. దక్షిణ భారత దేశంలో వాళ్లను ఆదరించేవారు కరువవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ ను ఆదరిస్తారని అనుకుంటున్నాం..

‘జనత’ ప్రతినిధి: అల్గునూర్ లో ఆసుపత్రి, గ్రంథాలయంల నిర్మిస్తానని వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. వీటికి ఎటువంటి కార్యాచారణ రూపొందించారు?
‘కవ్వంపల్లి’: ప్రతీ మండలంలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తా. ఇది నా వ్యక్తిగత హామీ. ఈ స్టడీ సర్కిల్ కోసం ప్రత్యేకంగా భవనం నిర్మిస్తాం. వీటి భూమి కోసం సెర్చ్ చేస్తున్నాం. అలాగే స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం కలెక్టర్ కు ఇప్పటికే దరఖాస్తు చేశాం. ఇందులో బుక్స్ డోనేట్ చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.

‘జనత’ ప్రతినిధి: కమ్యూనిటీలో ఉన్స కీలకమైన సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
కవ్వంపల్లి’: జనాభాలో 18 శాతం ఎస్సీలు ఉన్నారు. వీరిలో చాలా మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరి అభివృద్ధికి గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పకుండా నిరుగ్యోలను ప్రోత్సహిస్తుంది. చిన్న పరిశ్రమ పెట్టుకోవాలనుకున్నా.. వారికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 37 వేల ఉద్యోగాలను అందించింది. మిగతా వారందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో జరిగన విధంగా ఎటువంటి చీటింగ్ లేదా పేపర్ లీక్ లేకుండా టీఎస్పీఎస్ చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించారు. దీంతో ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ‘జనత’ ఛానెల్ ద్వారా యువతకు సూచించేదేంటంటే యువత బాగా చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.

గత ప్రభుత్వం మూడెకరాల భూమి, ఉద్యోగాలు అని మోసం చేసింది. దళిత బంధు పేరిట రూ.10 లక్షలు ఇస్తామని మోసం చేశారు. ఈ పథాకాలు ఓట్లకోసమే తప్ప ఎస్సీలకు మంచి జరగాలని తీసుకురాలేదు. దీంతో వారే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల సానుకూలంగా ఉంటుంది.

‘జనత’ ప్రతినిధి: నియోజకవర్గానికి సంబంధించి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమున్నాయి? వాటిని ఎలా చేరుకోగలుగుతారు?
‘కవ్వంపల్లి’: ఒక్కో మండలానికి ఒక్కో సమస్య ఉంది. మానకొండూర్ టౌన్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యక్తంగా ఉంది. దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాం. చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు. గ్రామాల్లో పాఠశాలల్లో టీచర్లు లేరు. మరికొన్ని పాఠశాలల్లో ముగ్గురు విద్యార్థులకు 7గురు విద్యార్థులు ఉన్నారు. ఇటువంటి సమస్యలపై ముఖ్యమంత్రికి వివరించనున్నాం.ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. అలాగే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. స్కూళ్లు, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన లక్ష్యం. వీటితో పాటు కొన్ని మండలాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేస్తాం.

‘జనత’ ప్రతినిధి: కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మీ వెంటే నడిచిన నాయకుల కోసం ఏం చేయబోతున్నారు?
‘కవ్వంపల్లి’:కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు నాతోని చాలా మంది ఉన్నారు. వారి ఆర్థిక బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తా. ఇప్పటికే వీరి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా. మార్కెటింగ్ కమిటీ లేదా సుడా ఇతర నామినేటెడ్ పోస్టులు వచ్చేలా చేస్తాం. కష్టపడ్డ ప్రతీ నాయకుడికి న్యాయం చేస్తాం.

‘జనత’ ప్రతినిధి: పదవుల విషయంలో కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చిన వారు.. పార్టీతోనే ఉన్నవారి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏమంటారు?
‘కవ్వంపల్లి’: కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తామని ఎటువంటి హామీలు ఇవ్వలేదు. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ముందు ప్రయారిటీ పార్టీలో కష్టపడ్డవారికే. ఆ తరువాతే మిగతా వారి గురించి ఆలోచిస్తాం. వారిని గుండెల్లో పెట్టుకొని వారికి సముచిత న్యాయం కల్పిస్తాం.

‘జనత’ ప్రతినిధి: విద్యావేత్త అయిన కవ్వంపల్లికి మంత్రి పదవి వస్తోందన్న ఆశలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. దీనిపై స్పందన?
‘కవ్వంపల్లి’: మాదిగకు చెందిన నేను మంత్రి పదవిలో ఉండాలని చాలా మంది అనుకుంటున్న మాట వాస్తవమే. మాదిగ కులానికి ఒక మంత్రి పదవి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఊహాజనితాలు ఎన్ని ఉన్నా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కాలమే దానికి సమాధానం చెబుతుంది.

‘జనత’ ప్రతినిధి: కొందరు మీపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఎలా ఎదుర్కోగలుగుతారు?
‘కవ్వంపల్లి’: మానకొండూర్ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసైన్డ్ భూములు బాగా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. వాటిపై సర్వే చేయించాం. ఈ సర్వేను ఆపాలని వారు కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చారు. అయినా సర్వే చేయడంతో హైకోర్టుకు వెళ్లారు. అక్కడా చుక్కెదురైంది. అయితే తన భూమి ఎక్కడ పోతుందోనని ఓ ప్రధాన పత్రిక ద్వారా అడ్డమైన రాతలు రాయిస్తున్నాడు. అయినా దీనిపై గట్టిగా ఎదుర్కొంటాం. నియోజకవర్గంలో తిరకుండా చేయడానికి రెడీగా ఉన్నాం. బెజ్జంకిలో 50 ఎకరాలు కబ్జాలు ఉంటే 30 ఎకరాలు ప్రభుత్వానికి అప్పజెప్పాం ప్రభుత్వ భూమిలో వెయింగ్ బిల్ మిషన్ ఉంటే తొలగించాం. వీటిని చూసి కొందరు భూ కబ్జా చేసిన వారు తమ నిర్మాణాలను స్వయంగా తొలగించుకున్నారు.

‘జనత’ ప్రతినిధి: నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఎలా పరిష్కరించగలుగుతారు?
‘కవ్వంపల్లి’: రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున సమస్య అకాల వర్షానికి ధాన్యం తడవడం. విదేశాల్లో తడిసిన ధాన్యాన్ని డ్రై చేస్తారు. దీనిని స్టడీ చేసి ఐకేపీ ద్వార డ్రైయ్యర్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. రైతులు ఇబ్బందులు పడకుండా డ్రైయింగ్ మీషన్ న తీసుకొస్తాం. ఈ మిషన్ రైతుల ధాన్యాన్ని డ్రై చేసి కొలిచి బ్యాగులో ప్యాకింగ్ వరకు చేస్తుంది. వీటితో పాటు మేడిగడ్డ బ్రిడ్జి డ్యామేజీ కారణంగా రైతులు సమ్యలు ఎదుర్కొంటున్నారు. ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరురుకు నీరు రాకపోవడంతో ఇల్లంతకుంట మండల రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. రైతులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

‘జనత’ ప్రతినిధి: దొడ్డు వడ్లపై బోనస్ ప్రకటించే అవకాశం ఉందా?
‘కవ్వంపల్లి’: దీనిపై మంత్రి ప్రకటన చేశారు గానీ. కానీ ఎన్నికల కోడ్ అయిపోయిన తరువాత పూర్తి సమాచారం బయటకు వస్తుంది.

‘జనత’ ప్రతినిధి: యూత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎలాంటి సలహా ఇస్తారు?
‘కవ్వంపల్లి’: రాజకీయాల్లోకి విద్యావంతులకు తప్పకుండా అవకాశం ఉంటుంది. సేవ చేయాలని ఆలోచనతో వచ్చే వారికి బాగానే ఉంటుంది. కానీ డబ్బు సంపాదన కోసం వచ్చే వారు మాత్రం నష్టమే మిగిలుతుంది.

‘జనత’ ప్రతినిధి: డిస్ట్రిక్ లిమిటేషన్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఆ మూడు మండలాలు కలుస్తాయా?
‘కవ్వంపల్లి’:కచ్చితంగా సాధ్యమవుతుంది. త్వరలో 17 లేదా 19 జిల్లాలు అవుతాయి. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మారనుంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోకి బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలు కలిసే అవకాశం ఉంది.

‘జనత’ ప్రతినిధి: జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషి చేయనున్నారు?
‘కవ్వంపల్లి’: వచ్చే సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ మరింత పటిష్టంగా మారుతుంది ప్రస్తుతం పార్టీ మంచి పొజిషన్ లోనే ఉంది. ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం.

 

 

 

 

 

 

 

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page