Saturday, September 13, 2025

కళాశాల ఎంపికపై విద్యార్థులు ఆలోచించాల్సిందే..

  • బ్రాండ్ ల పేరుతో బాదుడే
  • ఆప్షన్లకు ముందే సీనియర్లను సంప్రదించండి
  • ప్లేస్ మెంట్స్ కు దూరం
  • ఆఫ్ ద రికార్డు కథనం…

కరీంనగర్, జనతా న్యూస్:ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తు విద్య కోసం కళాశాల ఎంపిక విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే సూచించాల్సి వస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిప్లొమా, ఎంబీఏ కోర్సులలో చేరబోయే విద్యార్థులు ఎలాంటి కళాశాలలో చేరాలి… విద్యా బోధన, ప్రాక్టికల్స్, ప్రాజెక్టుల తీరు… ఆయా కళాశాలలో వసతుల కల్పన… అదనపు రుసుముల పేరుతో దండుకుంటున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవడం తప్పనసరని చెప్పకనే చెప్పవచ్చు.

కరీంనగర్ జిల్లాలో విద్యను అభ్యసించే విద్యార్థులు కళాశాలల ఎంపిక విధానంలో జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో అటు విద్యార్థులకు… ఇటు తల్లిదండ్రులకు మంచి జరిగే అవకాశం ఉంది. కళాశాల ఎంపిక సమయంలో విద్యార్థులకు ఆప్షన్ల ప్రక్రియనే కీలకం. దీనికి ముందే తల్లిదండ్రులు, విద్యార్థులు మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు కళాశాలల తీరు, అందులో విద్యార్థులు చేరిన తరువాత జరుగుతున్న విధానాలపై ముందుగానే తెల్సుకోవాలి.

ఉన్నత విద్య కోసం ప్రొపెషనల్స్ కోర్సులలో చేరాలనుకున్న విద్యార్థులకు మొదటి నుంచి తిప్పలు తప్పడం లేదు. కళాశాలలో విద్యాభ్యాసంకు చేరిన నాటి నుండి కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చే వరకు అసలు ఫీజుల కంటె అదనపు భారం తడిసి మోపెడు అవుతోంది. అన్నీ చెల్లించినా విద్యార్థులు అవస్థలు పడుతున్న సందర్భాలు అనేకమని చెప్పొచ్చు. ఓ పక్క ఇవన్నీ బాధిస్తుంటే.. మరో పక్క వసతులు, సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు బాధలకు గురవుతున్నారు. మరికొన్ని తమకున్న బ్రాండ్ పేరును చెప్పుకుంటూ… తమకున్న అదనపు అనుమతులను చెప్పుకుంటా విద్యార్థుల నుండి అదనపు ఫీజులు బాదుతున్నట్లు తెలుస్తోంది.

కళాశాలలో చేరిన విద్యార్థికి అడ్మిషన్ ఫీజుతో మొదలై పరీక్ష ఫీజుతో ఆ ఏడాది ముగుస్తుంది. ఒక్కో కళాశాలలో అడ్మిషన్ ఫీజుగా రూ.5వేల వరకు వసూలు చేస్తుంటారు. మొదటి సంవత్సరం నుండి చివరి సంవత్సరం వరకు హాజరు శాతం తక్కువగా ఉందని చెబుతూ యూనివర్సిటీకి వందల్లో చెల్లించాల్సి ఉంటే… కళాశాల యాజమాన్యాలు వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. సమయానికి పరీక్ష ఫీజు తీసుకోకుండా ఫీజు చెల్లింపు గడువు పూర్తయ్యే వరకు విద్యార్థులను తిప్పుతూనే ఉంటారు. చివరకు యాజమాన్యం చెప్పినంత విద్యార్థులు సమర్పించుకుంటేనే పరీక్ష ఫీజు తీసుకునే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కళాశాలలోనే ప్రాజెక్టులు చేయించాల్సి ఉండగా బయట కొనుగోలు చేసుకోవాలని సూచించే కళాశాలలున్నాయి. అంతేకాకుండా ప్రాజెక్టుల పేరుతో తృతీయ సంవత్సరం విద్యార్థుల వద్ద రూ.3వేలు, ఫైనలియర్ విద్యార్థుల వద్ద రూ.5వేలు వసూలు చేస్తున్న వారున్నారు. విద్యార్థులపైన ప్రాజెక్టులను బయట కొనుగోలు చేసిన భారమే కాకుండా కళాశాలలకు చెల్లించాల్సిన డబ్బులు తడిసి మోపెడవుతున్నాయి. బ్రోకేజ్ పేరుతో కళాశాలలోని ప్రతీ విద్యార్థి నుండి యాజమాన్యాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పలు కళాశాలలు బ్రాండ్ ల పేరుతో, అదనపు అనుమతులు, తమకున్న గొప్పను చెప్పుకుంటూ అదనంగా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు వినికిడి. అదనంగా వసూళ్ల పర్వానికి తెరతీసిన పలు కళాశాలల యాజమాన్యాలు అదనంగా దండుకునే సొమ్మును కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకుంటన్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ బదలాయింపులను అస్సలు అంగీకరించరు. అడ్మిషన్ సమయంలో చెప్పకుండా అదనంగా డబ్బులు దండుకుంటున్న కళాశాలలు విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాహార్తిని తీర్చేందుకు బోరు నీటిని వినియోగించడం, కంపుకొట్టే టాయిలెట్స్, గదుల్లో తిరగని ఫ్యాన్లు ఉన్న కళాశాలలున్నాయి. కళాశాలల పూర్వపరాలను తెల్సుకుని, నేరుగా వెళ్లి కళాశాలలో వసతులను పరిశీలించిన తరువాతే చేరికపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కళాశాలలో చదివిన, చదువుతున్న విద్యార్థులను కదిలిస్తే ఆయా కళాశాలల నిజ స్వరూపాలు తెల్సిపోతాయి.

క్రమశిక్షణకు, బ్రాండ్ కి మారుపేరుగా చెప్పుకున్న పలు కళాశాలలు పేరు గొప్ప తీరు దిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. యజమాన్యాలు తామే గొప్ప అన్నట్లుగా ప్రకటనలు చేసుకుంటున్నా… కళాశాల లోనికి వేళ్తే మాత్రం విద్యార్థుల పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదనే చెప్పాలి. సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకున్న పలు యాజమాన్యాలైతే నియంతలా వ్యవహరిస్తు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకున్న వారిని తక్కువ జీతానికి ఫ్యాకల్టీగా చేర్చుకుంటూ, పేరున్న కళాశాలలు సీనియర్ ఫ్యాకల్టీని తొలగించడం, ఫ్టాకల్టీ కి చెల్లించాల్సిన జీతాలలో సైతం మోసాలకు పాల్పడడంతో వారు ఆసక్తిగా పని చేయకపోవడం విద్యార్థులకు నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పలు కళాశాలు ఇటీవల కాలంలో తరుచూ ఏదో కారణంతో పత్రికల్లోకి ఎక్కిన సందర్భాలున్నాయి. ఆయా కళాశాలల గత చరిత్ర చూస్తే వివాదాస్పందగానే ఉంటోంది. కళాశాలల్లో పని చేసిన ఫ్యాకల్టీపై పోలీస్ స్టేషన్లలో కేసులైన ఘటనలున్నాయి. పేపర్ లీకేజీ కేసులు సైతం నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఉహించుకోవచ్చు. అటు విద్యార్థుల విషయంలో, ఇటు ఫ్యాకల్టీ విషయంలో కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇంజినీరింగ్, ఫార్మసీ, డిప్లొమాలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందుగానే తెల్సుకుని కళాశాలలో చేరితే బాగుంటుంది.

ప్లేస్ మెంట్స్ కి దూరమే…

ఇంజినీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ పై యాజమాన్యాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఫైనలియర్ లోనే వివిధ కంపెనీలు ఆయా కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ నిర్వహిస్తుంటాయి. గతంలో కరీంనగర్ లోని పలు కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ నిర్వహించినా… గత కొన్నేళ్లుగా ప్లేస్ మెంట్స్ కి దూరంగానే ఉంటున్నాయి. ఎంత ప్రతిభ ఉన్నా కళాశాల నుండి బయటకు వెళ్లిన తర్వాతనే ఉద్యోగాలు వెతుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్లేస్ మెంట్స్ విషయంలో విద్యార్థులు కళాశాల గత చరిత్రను, కళాశాలలో చదివిన విద్యార్థులను అడిగి తెల్సుకుని అడ్మిషన్లు తీసుకుంటే బాగుంటుందని సూచించక తప్పదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page