Thursday, September 19, 2024

వీధి కుక్కల స్వైర విహారం

దాడులపై నియంత్రణా చర్యలు శూన్యం !
సీఎం ఆదేశాలతోనైనా..
అధికారులు కదిలేనా ?
కుక్కల బెడదపై నిపుణులతో కమిటీ
ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ఎప్పుడు ?

కరీంనగర్‌-జనత న్యూస్‌

‘కుక్కలను చూస్తేనే జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ మూల నుండి వచ్చి దాడి చేస్తాయో తెలియడం లేదు. రోడ్డుపై నడచి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తుంది’ ఈ పరిస్థితి ఒక హైదరాబాద్‌ లోనే కాదు కరీంనగర్‌ జిల్లాలోనూ ఉన్నాయి. రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై రెచ్చిపోయి దాడి చేస్తున్నాయి శునకాలు. రోజుకో చోట వీధి కుక్కల భారిన పడి గాయాల పాలైన వారు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో దర్శనమిస్తునే ఉన్నారు.
‘‘నిన్న హుజురాబాద్‌ పట్టణంలో ఓ పిచ్చికుక్క 30 మందికి గాయపర్చిన విషయం తెలిసిందే. అదే కుక్క గురువారం తెల్లవారు జామున గాంధీనగర్‌ కు చెందిన పర్లపల్లి భాగ్య, మాడుగుల విజయలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వీరే కాదు.. సానిటరీ సూపర్‌వైజర్‌ ఆరెల్లి రమేష్‌ను గాయపర్చింది. ఇలా పలువురిపై దాడికి పాల్పడ్డ పిచ్చి కుక్కను స్థానికులు కొట్టి చంపాల్సి వచ్చింది.’’

కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఓ పిచ్చి కుక్క 14 మందిని కరిచింది. ఇటీవల నగరంలోని ప్రకాశం గంజ్‌లో ముగ్గురిపై దాడి చేసింది మరో శునకం. ఇందులో విద్యార్థి కూడ ఉన్నాడు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం బృందవన్‌ కాలనీలో రెండేళ్ల బాలున్ని తీవ్రంగా గాయపర్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సంఘటనలున్నాయి.

నియంత్రణా చర్యలు శూన్యం
జిల్లాలో ఇలా కుక్కలు రెచ్చిపోయి కరుస్తూ ఉంటే..అధికార యంత్రాంగం నియంత్రణా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజుకో సంఘటన జరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు . ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో కొద్ది నెలల క్రితం కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ రెండు రోజుల పాటు మొక్కుబడిగా అక్కడ క్కడ కొన్ని శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి చేతులు దులుపుకుంది. ఆ తరువాత జిల్లాలోని వీధి కుక్కలకు రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన దాఖలాలెక్కడా లేవు.

సీఎం ఆదేశిస్తే తప్ప..
హైదరాబాద్‌ జవహర్‌ నగర్‌ వీధి కుక్కల దాడిలో రెండేండ్ల బాలుడి మృతి సంఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి మున్సిపల్‌ యంత్రంగంపై సీరియస్‌ అయ్యారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ వీధి కుక్కల దాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడుల నివారణకు కరీంనగర్‌ జిల్లాలో అధికారులు తీసుకునే చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
కమిటీ వేసెదెప్పుడు ?

వీధి కుక్కల బెడదపై ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పశు వైద్యులు, బ్లూ క్రాస్‌ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులో కమిటీ వేసి దాడుల నియంత్రణా చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్‌ మందును అందుబాటులో ఉంచాలని ఆదేశాలున్నాయి. అయితే..ఈ కమిటీలు ఏదో మొక్కుబడిగా కాకుండా..కుక్కల దాడుల నియంత్రణకు చర్యలు తీసుకునేలా ఉండాలని పలువురు కోరుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page