సామాజిక సేవే కాదు..స్వయం ఉపాధికీ ఊతం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మగ్గం వర్క్స్‌లో శిక్షణ
సిరిసిల్ల-జనత న్యూస్
సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు స్వయం ఉపాధికి ఊతం ఇస్తోంది లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డి పేట. ప్రస్తుత పోటీ మార్కెట్‌లో గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తుంది. తాజాగా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డి పేట ఆధ్వర్యంలో నాబార్డ్ సౌజన్యంతో 30 మంది మహిళలకు నెల రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మగ్గం వర్క్స్ శిక్షణలో మహిళలు మెలుకువలు, మంచి నైపుణ్యం పొందారు. దీంతో స్వయం ఉపాధి పొంది ఆదాయం పెంచుకునే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..గంభీరావుపేట, ఎల్లారెడ్డి పేట మండలంలోని మహిళలకు మగ్గం వర్క్స్‌లో శిక్షణ ఇప్పించడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని వృద్దిలోకి రావాలని సూచించారు. ప్రస్తుత డిమాండ్ ఉన్న మగ్గం వర్క్స్ ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..భవిష్యత్‌లో వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకుని ఇతరులకు మార్గ దర్శులుగా నిలవాలని కోరారు. తాము భవిష్యత్‌లోనూ ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ కోట సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాయన భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల లింగారెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సద్ది లక్ష్మారెడ్డి, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు రావుల ముత్యం రెడ్డి, రావుల మల్లారెడ్డి, పల్లి సాంబశివరావు పాల్గొన్నారు.