ఇది ఆత్మ హత్యనా? హత్యనా…?
బావి వద్దనే పోస్టుమార్టం
వైద్యుల నివేదికనే కీలకం
కరీంనగర్, జనతా న్యూస్:
కరీంనగర్ శివారులోని జ్యోతిష్మతి కళాశాలకు చెందిన విద్యార్థి మృతి సంచలనంగా మారింది.ఈ నెల 27న విద్యార్థిది తలలేని మొండెం ఓ బావిలో లభ్యమైంది. తల మాత్రం దొరకలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే చర్చ సాగింది. ఈ తరుణంలో మంగళవారం పుర్రెను బావిలో పోలీసులు గుర్తించారు. అది విద్యార్థి దేనని పోలీసులు భావిస్తున్నారు.దీంతో ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరిపి వివరాలు తేల్చనున్నారు.
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ (20) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి కళాశాలలో డిప్లోమా మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ లో ఉంటున్న ఈయన మార్చి 1న స్నేహితుని బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు నలుగురు హాస్టల్ విద్యార్థులు, మరో ఆరుగురు బయటి విద్యార్థులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే ఓ ప్రదేశంలో వేడుకలు జరుపుకున్న వీరిలో నలుగురు హాస్టల్ కు చెందిన విద్యార్థులు తిరిగి హాస్టల్ కు చేరుకున్నారు. ఆ తరువాత కాసేపటికి తనను తీసుకెళ్లాలని అభిలాష్ బయట ఉండే స్నేహితుడికి ఫోన్ చేశాడు. కాసేపటికి అభిలాష్ ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో అతనిని కలవలేకపోయామని హాస్టల్ లో ఉండే విద్యార్థులు ఇటీవల పోలీసులకు తెలిపారు.
ఆ తరువాత రోజు నుంచి తల్లిదండ్రులు సైతం ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో మార్చి 3న తిమ్మూపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు అభిలాష్ కోసం గాలించారు. ఈ క్రమంలో మార్చి 27న ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి
మహాత్మనగర్ వద్ద ఉంది 100 కి కాల్ చేసినది. ఆమె బంధువులు,.పోలీసులు సమీపంలో బావులను వెతికారు. ఆమెను కాపాడే క్రమంలో ఓ బావిలో మృతదేహం లభించింది. దీనిని పరిశీలించిన పోలీసులు అభిలాష్ బాడీగా గుర్తించారు. పోస్టు మార్టం తరువాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
మార్చి 27న అభిలాష్ తలలోని మొండెం మాత్రమే లభ్యమైంది. దీంతో అభిలాష్ ది ఆత్మహత్యా? లేక హత్యనా? అనే అనుమానాలు రేకెత్తాయి. దర్యాప్తులో భాగంగా సీఐ స్వామి, ఎస్ ఐ చేరాలు, నరేష్ రాజేష్ ల బృందం కలిసి అభిలాస్ మృతదేహం దొరికిన బావిలో నీటిని పూర్తిగా తీసేయించారు. దీంతో తాజాగా ఏప్రిల్ 2న మంగళవారం బావిలో పుర్రె
లభ్యమైంది. ఈ పుర్రెకు అక్కడే వైద్యులు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. మొండెం భాగాలు, పుర్రె భాగాలను పోస్టు మార్టం చేయించిన పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తరువాతనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
కారణాలు ఏమిటి..?
అభిలాష్ మృత దేహం బావి లో దొరికిన విషయం తెలిసిందే. అయితే తనది హత్యా… ఆత్మ హత్యా తెలియాల్సి ఉంది. ఆత్మ హత్య అయితే ఎందుకు చేసుకున్నాడు… ఎవరైనా ఏమైనా అన్నారా .. బెదిరించారా.. బయపడినాడా… అనే కోణంలో పోలీసులు విచారించి కారణాలు రబట్టల్సిన అవసరం ఉంది. హత్య ఆయితే ఎవరు చేశారు… ఎందుకు చేసారు… అనే కారణాలు సైతం పోలీసులు రాబట్టాల్సి ఉంటుంది. ఏదీ ఏమైనా అభిలాష్ మృతి విషయంలో వైద్యుల నివేదికనే కీలకం కానుంది.