Saturday, March 14, 2026

పురుమల్లకు షోకాజ్

  •  పార్టీ నిబంధనలు అతిక్రమించారని ఆరోపణలు
  •  గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యారని..
  •  ఎలక్షన్ ఫండ్ కూడా ఖర్చు పెట్టలేదని స్థానిక నేతల ఫిర్యాదులు
  •  మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీస్ జారీ చేసిన టీపీసీసీ

(కరీంనగర్, జనత ప్రతినిధి)
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్‌పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల్లో ఆయన పట్టింపులేనితత్వమే పార్టీ ఓటమికి కారణమైందంటూ.. కార్యకర్తల పట్ల ఆయన వైఖరి సరిగా లేదంటూ.. స్థానిక నేతల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేగాకుండా గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు పరోక్షంగా మద్దతుగా నిలిచారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు అధిష్టానం దృష్టికి వచ్చాయి. దీంతో వీటన్నింటిపై వివరణ కోరుతూ టీపీసీసీ ఆయనకు గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఆయన వైఖరి వల్లే మూడో స్థానం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా నడిచింది. కానీ.. కరీంనగర్‌లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలుపొందారు. బీజేపీ నుంచి బరిలో దిగిన బండి సంజయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్ సెగ్మెంట్‌లో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఓటమికి గల కారణాలను బేరీజు వేశారు. ఆ వెంటనే జరిగిన పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

పార్టీ ఫండ్ కూడా ఖర్చు చేయలే..

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్యాండిడేట్లకు తలా కొంత ఫండ్ ఇచ్చింది. కరీంనగర్ అభ్యర్థిగా పురుమల్ల శ్రీనివాస్ కనీసం ఆ ఫండ్‌ను సైతం ఖర్చు చేయలేదని ఫిర్యాదులు వెళ్లాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రయోజనాల కోసం పార్టీ ఇచ్చిన ఎన్నికల నిధులను ఖర్చు చేయలేదని అధిష్టానం గుర్తించింది. అలాగే.. ఎన్నికల వేళ ప్రజల్లో తిరగలేదని.. కనీసం బైక్ ర్యాలీలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ చేపట్టలేదని ప్రధాన అభియోగం. అలాగే.. ఏఐసీసీ నేతలు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎన్నికల వేళ సమావేశాలకు వస్తే కేడర్‌కు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని.. అటు సమావేశాలు నిర్వహించడంలోనూ విఫలమయ్యారని షోకాజ్‌లో పేర్కొన్నారు. ఏఐసీసీ సమన్వయకర్తలు, పరిశీలకుల సూచనలను సైతం పట్టించుకోలేదని తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కు..

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్మి కరీంనగర్ టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కష్టపడలేదని శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. బీఆర్ఎస్, బీజేపీలకు పరోక్షంగా మద్దతిచ్చారని, ఆ పార్టీలతో కుమ్మక్కయ్యారని స్థానిక నేతల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెళ్లాయి. ఇదే అంశాన్ని అధిష్టానం సైతం షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. షోకాజ్ అందిన మూడురోజుల్లో సరైన సమాధానం రాకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అందులో పేర్కొంది. మరి దీనిపై పురుమల్ల శ్రీనివాస్ ఎలా స్పందిస్తారు..? అధిష్టానానికి ఎలాంటి వివరణ ఇస్తారు..? అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page